కరోనా వ్యాక్సిన్లను నిల్వచేయడానికి సాధారణంగా కోల్డ్ చైన్ స్టోరేజి అవసరం. కానీ కోల్డ్‌చైన్ స్టోరేజీ అవసరం లేకుండా ఎలాంటి ఉష్ణోగ్రతల్లోనైనా నిల్వచేయగల కొత్త వ్యాక్సిన్ మన దేశంలోనే తయారైంది. బెంగళూరు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) , బయోటెక్ స్టార్టప్ కంపెనీ మైన్‌వ్యాక్స్ సంయుక్తంగా వార్మ్ ( వెచ్చని) అనే పేరుతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు.
ఎలుకలపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించగా ప్రాథమిక అధ్యయనం లోనే సత్ఫలితాలు కనిపించాయి. డెల్టా, ఒమిక్రాన్‌తోపాటు ఇతర కొత్త వేరియంట్లను ప్రతిఘటించే బలమైన యాంటీబాడీలను ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలుగుతుందని పరిశోధకులు తెలుసుకున్నారు.
మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే డెల్టాను ఎదిరించడంలో రెండున్నర రెట్లు, ఒమిక్రాన్‌ను ప్రతిఘటించడంలో 16.5 రెట్లు ఈ వ్యాక్సిన్ సమర్థత చూపిస్తుందని చెబుతున్నారు. ఈ వార్మ్ వ్యాక్సిన్‌ను 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో నాలుగు వారాల వరకు, 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో 90 నిమిషాల వరకు నిల్వ చేయవచ్చని ఆస్ట్రేలియా కామన్వెల్త్ సైంటిఫిక్, అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి ఆర్గనైజేషన్ (సిఎస్‌ఐఆర్‌ఒ)పరిశోధకులు వెల్లడించారు.
ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లలో కొవిషీల్డ్ 2 నుంచి 8 డిగ్రీలు, ఫైజర్‌కు మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. ఈ వార్మ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, దేశాల్లో వ్యాక్సిన్ నిల్వ చేసుకోవచ్చు. రవాణా కూడా సులువవుతుంది.