గుంటూరులో ఈ నెల ఒకటో తేదీన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సభలో జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి గురువారం విచారణ ప్రారంభించారు. ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానుకల పంపిణీ సందర్భంగా చంద్రబాబునాయుడును ఆహ్వానించి ఆయనతో పంపిణీకి శ్రీకారం చుట్టారు.
సభ ముగిసిన తరువాత ప్రజలకు కానుకల కిట్లు పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం విదితమే. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్లు, 19 మంది గాయపడినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి సందర్శించారు. స్థానికులను విచారించారు.
ఘటన ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు మాట్లాడుతూ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కానుకల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారని, సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. క్యూలైన్లలోకి ఎదురుగా మహిళలు రావడంతో, ఎవరికి వారు తమకే కానుకల కిట్ కావాలని తాపత్రయపడడంతో తొక్కిసలాట జరిగిందని వివరించారు.
అనంతరం జస్టిస్ శేషశయనారెడ్డి ప్రభుత్వ అతిథి గృహంలో విచారణ కొనసాగించారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబాల వాగ్మూలం రికార్డు చేశారు. గాయపడిన వారిలో కొంతమందికి పరిహారం అందలేదని, తాము చికిత్సపొంది వెంటనే ఇళ్లకు వెళ్లిపోవడంతో తమ పేర్లు నమోదు చేయలేదని ఈ సందర్భంగా పలువురు బాధితులు తెలిపారు.
ఆ తర్వాత జిల్లా అధికారులతో జస్టిస్ శేషశయనారెడ్డి చర్చించారు. ఘటన పూర్వపరాలపై జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎస్పి ఆరీఫ్ హఫీజ్‌లను అడిగి తెలుసుకున్నారు. విచారణ జరిగే ప్రదేశానికి మీడియాను అనుమతించలేదు. అంతకుముందు కమిటీ తరుఫున వచ్చిన అధికారులు, న్యాయవాదులు సభా ప్రాంగణం ఎన్ని ఎకరాలో? ఎంతప్రాంతంలో ప్రజలు వచ్చారో? సర్వే డిపార్టుమెంట్ ద్వారా కొలతలు తీసుకున్నారు.