పాకిస్తాన్లో హిందూ బాలికల కిడ్నాప్, బలవంతపు మత మార్పిడి యధేచ్చగా జరుగుతున్నది. ఇటీవల కొందరు దుండగులు ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఇస్లాం మతంలోకి మార్చారు. ఆమె మతం మారినట్లు సర్టిఫికెట్ తెరపైకి రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో జరిగింది. నెల రోజుల వ్యవధిలో ఇది రెండో కేసు కావడం విశేషం. పాకిస్తాన్లో హిందూ బాలికలను కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చుతున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఓ 14 ఏండ్ల వయసున్న జమున అనే బాలికను కిడ్నాప్ చేసిన కొందరు దుండగులు ఆమెను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు.
వారం రోజుల క్రితం సింధ్‌లోని తాందో అల్లాయార్ ప్రాంతంలో ఇంటికెళ్తున్న బాలికను అడ్డగించిన కొందరు బలవంతంగా ఎత్తుకెళ్లారు. మత మార్చిడి సర్టిఫికెట్ తెరపైకి రావడంతో ఆమెను మతం మార్పించినట్లుగా స్పష్టమవుతున్నది. ఇది సింధ్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన రెండో ఘటన.
పాకిస్తాన్లో నిరుపేద హిందూ కుటుంబాలు గత కొన్నాళ్లుగా అణిచివేతకు గురవుతున్నాయి. అమాయక అమ్మాయిలే లక్ష్యంగా కొందరు ఛాందసవాదులు ఈ కుట్రకు తెరలేపినట్లుగా తెలుస్తున్నది. గత సెప్టెంబర్ నెలలో నసర్పూర్ ప్రాంతంలో మీనా మేఘవార్ అనే 14 ఏండ్ల బాలిక కూడా ఇదే విధంగా కిడ్నాప్‌నకు గురైంది.
మీర్పుర్ఖాస్ పట్టణంలో మరో హిందూ వివాహిత కిడ్నాప్ అయింది. అనంతరం ఆమె ముస్లింతో కనిపించగా ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇష్టప్రకారమే మతం మార్చుకుని అహ్మద్‌ను పెండ్లాడినట్లు పోలీసులు చెప్పి పంపించేశారు.