భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ నుంచి ఈ ఏడాది చివరిలోపు 11 రాకెట్ ప్రయోగాలను చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు షార్ సెంటర్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తెలియజేశారు. గురువారం షార్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో షార్ డైరెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో పీఎస్ఎల్వీ రాకెట్ 5, ఎల్వీఎం 2, ఎస్ఎస్ఎల్వీ 2, జీఎస్ఎల్వీ -ఎఫ్12 రాకెట్‌తో పాటు మరో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం కూడా ఉంటుందని తెలిపారు.
ఈ ఏడాది చివరలో గగన్‌యాన్ -డి1 ప్రయోగం ఉంటుందని దీనికి సంబంధించిన వివిధ భూ పరీక్షలను ఇప్పటికే ఇస్రో పూర్తి చేసిందని ఈ ఏడాదిలో ప్రధానంగా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహ ప్రయోగము, చంద్రయాన్ -3, వన్‌వెబ్, ఎల్వీఎం -3 మానవరహిత గగన్ యాన్ -డీ1 ఉపగ్రహ ప్రయోగాలు ఉంటాయని తెలిపారు.
ఇప్పటికే షార్‌లో రాకెట్ తయారీకి రాకెట్ ప్రయోగానికి కావాలసిన అన్ని రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సమకూర్చిన మౌళిక వసతులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలియజేశారు.