టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంగారుపాళ్యంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైన నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. సెంటర్ లైన్లో సభ నిర్వహించవద్దని మరోచోట నిర్వహించుకోవాలని సూచించారు.
పోలీసులకు తీరుకు నిరసనగా నేలపైనే కూర్చుని లోకేశ్, టీడీపీ నేతలు నిరసన తెలిపారు. బహిరంగ సభను అడ్డుకున్న పోలీసు తీరుపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎవరు ఏం చేసినా యువగళం ఆపలేరని లోకేశ్ స్పష్టం చేశారు.
కార్యకర్తలకు ధైర్యం చెప్పిన లోకేశ్, పక్కనున్న భవనంపై నుంచి ప్రసంగించారు. నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహణకు ప్రయత్నం చేయడంతో టీడీపీ ప్రచార రథాన్ని సీజ్ చేశామని డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు.
లోకేష్ చేపట్టిన పాదయాత్ర శుక్రవారంతో 8 వ రోజుకు చేరింది. పాదయాత్రలో ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటూ లోకేష్ ముందుకెళ్తున్నారు. శుక్రవారం ఉదయం మొగిలి దేవాలయం సమీపంలోని విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలైంది. రాత్రికి ఆయన వజ్రాలపురం విడిది కేంద్రంలో బస చేశారు. ఇప్పటి వరకు లోకేష్ 88.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించారు.