భారత్‌లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతోందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హెచ్చరించింది. పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) హైదరాబాద్‌లో మారణహోమానికి ప్లాన్ చేస్తున్నాయని ఎన్ఐఏ తన ప్రాథమిక సమాచార నివేదికలో వెల్లడించింది.
నిఘావర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్ తమ సానుభూతి పరులకు హ్యాండ్ గ్రనేడ్లను అందుబాటులో ఉంచింది. భాగ్యనగరంలో దాడులు, పేలుళ్లకు కుట్ర పన్నింది. జనవరి 25న నమోదైన ఓ కేసులో హైదరాబాద్‌పై ఉగ్రవాదులు గురిపెట్టినట్లు వెల్లడైంది. మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టేందుకు బహిరంగసభలు, ఊరేగింపులను లక్ష్యంగా చేసుకోవాలని ప్రణాళిక రచించారు.
హ్యాండ్ గ్రనేడ్లు విసరడం ద్వారా తమ వ్యూహాలను అమలు చేయాలని ముష్కరులు భావిస్తున్నారని ఎన్ఐఏకు పట్టుబడిన వ్యక్తుల నుంచి దర్యాప్తు సంస్థ సమాచారాన్ని సేకరించింది. ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ ప్రకారం, హైదరాబాద్‌లో అనేక ఉగ్రసంబంధిత కేసులలో నిందితుడిగా ఉన్న అబ్దుల్ జాహెద్ అలియాస్ జాహెద్ అలియాస్ మహ్మద్‌కు కీలక ఈ ఆపరేషన్‌ను అప్పగించారు.
నగరంలో ఉగ్రదాడులకు అవసరమైన అనేక మంది యువకులను రిక్రూట్ చేసే పనిని ఐఎస్ఐ, ఎల్ఈటీ ఇతనికి కట్టబెట్టాయి. అక్టోబర్ 2022లో హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు కుట్రపన్నిన మాజ్ హసన్ ఫరూఖ్, సమీయుద్దీన్‌లపై కూడా ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. వీరిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద అభియోగాలు మోపారు.
జాహెద్ ఇంటివద్ద రెండు హ్యాండ్ గ్రనేడ్లు, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 3,91,800 నగదు స్వాధీనం చేసుకున్న తర్వాత, అక్టోబర్ 1వ తేదీన పోలీసులు ఉపా చట్టంకింద కేసు నమోదు చేశారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న హోంమంత్రిత్వశాఖ ఈ కేసును కేంద్రం పరిధిలోని కౌంటర్ టెర్రరిజం విభాగానికి అప్పగించడం జరిగింది.