పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. 79 ఏళ్ల ముషారఫ్ గత కొంతకాలంగా అమైలాయిడోసిస్ అనే రుగ్మతతో బాధపడుతూ దుబాయిలోని అమెరికన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ఆదివారం తెలిపాయి.
పాక్ అధ్యక్షుడిగా 8 ఏళ్ల పాటు నియంతలా పాలించిన ముషారఫ్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. భారత్ – పాక్ మధ్య కార్గిల్ యుద్ధానికి కుట్రలు పన్నడం దర్గర్నుంచి.. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య వరకు పలు కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు.
1999లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. 2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అభిశంసనను తప్పించుకొనేందుకు తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై దేశద్రోహం అభియోగాలు నమోదవడం, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు 2019లో మరణశిక్ష పడింది. ఆ తరువాత ఆ శిక్ష తాత్కాలికంగా వేశారు. 2016లో దుబాయి వెళ్లిన ముషారఫ్ అప్పటి నుంచి అక్కడే ఆశ్రయం పొందుతున్నారు.
పదవిపై కాంక్షతో ఏకంగా రాజ్యాంగాన్నే రద్దు చేసి అత్యవసర స్థితి విధించారు. ముషారఫ్ మృతి పట్ల పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం తెలిపారు. ముషారఫ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఆయన ఆలోచన, భావజాలం ఎంతో గొప్పవి అంటూ పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ సంతాపం తెలిపింది. పర్వేజ్ ముషారఫ్ ఒకప్పుడు భారత్కు బద్ధ శత్రువు. అయితే 2002-07లో శాంతికి నిజమైన శక్తిగా మారారు అని కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్లోని చైనా రాయబార కార్యాలయం ముషారఫ్ మరణంపై ట్వీట్ చేసింది. చైనా-పాక్ స్నేహా, సహకారానికి ఆయన చేసిన కృషి చైనా ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారంటూ చైనా సంతాపం తెలిపింది.