ఎంఎల్ఏల ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐకి అప్పగించొద్దంటూ రాష్ట్రప్రభుత్వం, బిఆర్ఎస్ ఎంఎల్ఏ పైలట్ రోహిత్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సిబిఐకి గతంలో కేసును అప్పగించిన సింగిల్ జడ్జీ తీర్పును తప్పుబట్టలేమని, అందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఇదిలావుండగా హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని తెలిసింది. అందుకు తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని అడ్వొకేట్ జనరల్ కోరారు. దానికి కూడా హైకోర్టు నిరాకరించింది.
గతంలో హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి ఎంఎల్ఏల ఎర కేసును సిబిఐకి బదిలీ చేయాలని తీర్పునిచ్చారు. సిట్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కూడా రద్దు చేసింది. సింగిల్ జడ్జీ తీర్పును సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసుకుంది.
ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి ఎన్. తుకారాం ధర్మాసనం అప్పీలుపై సుదీర్ఘ విచారణ జరిపింది. తాజాగా సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చింది.
బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. మోయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో కొందరు వ్యక్తులు.. తమను ప్రలోభపెట్టారన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి. డబ్బు ఆశ చూపారని, పార్టీ మారేందుకు ఒత్తిడి చేశారని వివరించారు. దీంతో ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది.
కాగా, బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎలాంటి మనీలాండరింగ్ జరగనప్పటికీ ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వాలని రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేయడంతో.. విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.