ఏపీ రాజధాని విషయంలో మరోసారి కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతే అని, విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసిందని తెలిపింది. వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.
విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ సూచనలు, సలహాలు, నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.
అనంతరం ఏపీసీఆర్డీయేను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం 2020లో సీఆర్డీయేను రద్దు చేసి, మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొస్తున్నట్టుగా కొత్త బిల్లును తీసుకొచ్చిందని నిత్యానంద్ రాయ్ చెప్పారు.
ఆ తర్వాత ఆ బిల్లును వెనక్కి తీసుకుందని, సీఆర్డీయే చట్టానికి కొనసాగింపుగా మరొక బిల్లును తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, దీనిపై ఇంతకు మించి మాట్లాడితే సబ్ జ్యుడిస్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. పైగా, మూడు రాజధానుల అంశంపై బిల్లు తీసుకొచ్చేముందు ఏపీ ప్రభుత్వం కేంద్రంను సంప్రదించలేదని పేర్కొంటూ దానితో తమకు సంబంధం లేన్నట్లు సంకేతం ఇచ్చారు.
మరోవంక, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారమే రాజధాని ఏర్పాటు జరిగిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6ల ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటు జరిగిందని, అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారని స్పష్టం చేసింది.
అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 23నే నోటిఫై చేసిందని కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారమే నిపుణుల కమిటీ వేసినట్లు గుర్తు చేసింది. నిపుణుల కమిటీ సూచనలతో అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని హోంశాఖ చెప్పింది.