శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్వి-డి2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రయోగంలో మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. వీటిలో దేశీయ ఉపగ్రహాలు రెండు, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం ఒకటి ఉన్నాయి.
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ శుక్రవారం ఉదయం 9.18 గంటలకు నింగిలోకి ఈ రాకెట్ దూసుకెళ్లింది. ఈ రాకెట్ 34 మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని నాలుగు దశల్లో శాస్త్రవేత్తలు ప్రయోగించారు.
మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో, రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో, నాలుగో దశలో 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 7851 సెకన్లలో పూర్తి చేశారు. ఈ చిన్న రాకెట్లో 156.3 కిలోల బరువున్న మూడు ఉపగ్రహాలను పంపారు.
ఇందులో ఒకటి స్కూల్ విద్యార్థులు రూపొందించి కావడం చెప్పుకోదగ్గ అంశం. శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మొత్తం 156.3 కిలోల బరువున్న భూ పరిశీలన ఉపగ్రహం ఇఒఎస్-07, చిన్నారుల సాయంతో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ రూపొందించిన 8.7 కిలోల బరువుగల ఆజాదీశాట్-02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువున్న జానూస్-01 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపారు.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే దేశంగా ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ పరిణామం ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగాన్ని ఆకర్షించనుంది. ఎస్ఎస్ఎల్వి-డి1 పేరుతో గతేడాది ఆగస్టులో చేసిన మొదటి ప్రయోగం విఫలం కావడంతో రెండో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేసి విజయం సాధించారు.