కన్నబిడ్డ చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు కన్నీటిని దిగమింగుతూనే 120 కిలోమీటర్లు స్కూటీపైనే మృతదేహంతో ప్రయాణించారు. ఎపిలోని విశాఖ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ చిన్నారి చికిత్స కోసం అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడ గ్రామానికి చెందిన ఓ గిరిజన దంపతులు విశాఖలోని కెజిహెచ్ ఆసుపత్రికి వచ్చారు. చికిత్స పొందుతున్న క్రమంలో చిన్నారి మృతి చెందింది.
దీంతో మృతదేహాన్ని తరలించేందుకు విశాఖలోని కెజిహెచ్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోడం, ప్రైవేటు అంబులెన్స్‌లో తరలించే స్తోమత లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు విశాఖ నుంచి పాడేరు వరకు స్కూటీపైనే మృతదేహాన్ని తరలించారు.
అంబులెన్స్ కోసం ఎంతలా ప్రాధేయపడినా కెజిహెచ్ సిబ్బంది కనికరించలేదని, అందువలనే గత్యంతరం లేక స్కూటీపై బిడ్డ మృతదేహాన్ని తరలించినట్లు బాధిత తల్లిదండ్రుల చెబుతున్నారు. కెజిహెచ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షం వలనే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆరోపించారు.
ఈ సంఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశాఖపట్నం కేజీహెచ్‌లో చనిపోయిన గిరిజన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. బిడ్డ మృతదేహాన్ని తీసుకుని 120 కిలో మీటర్లు ద్విచక్రవాహనంపై వెళ్లిన ఆ గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పాడేరు ప్రాంతంలోని కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, కొండబాబు దంపతుల పుట్టెడు శోకాన్ని దిగమింగుకొని బిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లడాన్ని చూసి ఎవరికైనా గుండె తరుక్కుపోతుందని చెప్పారు. కానీ, ఈ రాతి గుండె ప్రభుత్వంలో మాత్రం కనీస స్పందన లేదని పవ్ కళ్యాణ్ దుయ్యబట్టారు. కేజీహెచ్‌లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆస్పత్రిలో ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అమానవీయమని పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వంలో ఆసుపత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకుల అశ్రద్ధకు ఈ ఘటనే నిదర్శనమని జనసేన అధినేత ధ్వజమెత్తారు. కొద్ది నెలల క్రితమే తిరుపతి రుయా ఆస్పత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రి పడిన ఇబ్బందులను కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకెళ్లారని పేర్కొన్నారు.
ప్రభుత్వం గొప్పగా చెబుతున్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. బెంజి సర్కిల్లో అంబులెన్స్‌లు నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే చాలదని ఎద్దేవా చేశారు. వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 14 వేల కోట్ల బడ్జెట్ ఇచ్చినట్లు గొప్పలు చెప్పటం మాని.. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందేలా చూడాలని హితవుపలికారు.
ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించ లేని పాలకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారని విమర్శించారు. ఇక, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు.