గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు వంశీ ఫై విమర్శలు చేయడంతో వంశీ అనుచరులు టీడీపీ ఆఫీస్ ఫై దాడి చేసారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను వైస్సార్సీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీలో కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు.
సోమవారం జరిగిన ఈ ఘటన గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గన్నవరం ఎంఎల్ఎ వల్లభనేని వంశీమోహన్ అనుచరులు తనపై మారణాయుధాలతో దాడికి ప్రయత్నించారంటూ, తాను ఇంట్లోలేని సమయంలో తన కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారంటూ టిడిపి రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా సోమవారం ఉదయం గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడిగేందుకు టిడిపి నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్కు ఆయన వెళ్లారు. ఈ నేపథ్యంలో చిన్నాకు మద్దతు తెలిపేందుకు టిడిపి రాష్ట్ర నాయకుడు కె పట్టాభిరామ్ గన్నవరం వచ్చారని తెలుసుకున్న వంశీ అనుచరులు రెచ్చిపోయారు. గన్నవరంలోని టిడిపి కార్యాలయంపై దాడి చేశారు.
కార్యాలయంలోని కంప్యూటర్, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఓ టిడిపి నేతకు చెందిన కారును పెట్రోలు పోసి తగులబెట్టారు. మరో రెండు కార్లను ధ్వంసం చేశారు. వాహనాలపై విసిరిన రాళ్లు గురితప్పి దాడిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపైనా పడ్డాయి. ఈ దాడిలో సిఐ కనకరావుతోపాటు ఐదుగురు కానిస్టేబుళ్లకు, వార్తా సేకరణకు వెళ్లిన ఓ విలేఖరికి గాయాలయ్యాయి.
పోలీస్ స్టేషన్ వద్ద పట్టాభి ఉన్నారని తెలుసుకున్న వంశీ అనుచరులు అటుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈలోగా స్టేషన్ నుంచి పార్టీ కార్యాలయానికి వస్తున్న టిడిపి నేతలు మార్గమధ్యలో వంశీ అనుచరులకు ఎదురుపడ్డారు. ఈ సందర్బంగా వైసిపి, టిడిపి గ్రూపుల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం జరిగింది.
పట్టాభి కారుపై వైసిపి శ్రేణలు దాడికి ప్రయత్నించాయి. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం అక్కడ ఆందోళనకు దిగిన పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు.
పోలీసులు చూస్తుండగానే వైస్సార్సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని , ఈ విషయంపై పోలీసులను అడిగితే సమాధానం చెప్పేందుకు నిరాకరించారని , పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేసి విధ్వంసం సృష్టించడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. వైస్సార్సీపీ రౌడీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి రౌడీ పాలనకు పరాకాష్ఠ అని అచ్చెన్నాయుడు విమర్శించారు.