సంవత్సరకాలంగా భీకరమైన రష్యా దాడులతో వణికిపోతున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్లోఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం జరిపిన పర్యటన అందరిని ఆశ్చర్య పరిచింది. సోమవారం ఉదయం కీవ్‌లో కొంత అలజడి కనిపించినా.. ఎందుకు సైరన్లు మోగుతున్నాయో అక్కడ ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవరో పెద్ద వ్యక్తి వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నా, వచ్చేది బైడెన్ అని తెలిసేందుకు చాలా సమయం పట్టింది.
ఈ నెల 24వ తేదీకి ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలై ఏడాది అవుతున్న సమయంలో ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటించడం ఆసక్తికరంగా మారింది. సైనిక చర్య మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌కు సంఘీభావంగా ఆయన పర్యటించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన సందర్భంగా గతంలో హామీ ఇచ్చినట్టుగా ఉక్రెయిన్‌కు ఫైటర్ జెట్లు, ఇతర ఆయుధాలను త్వరగా పంపించాలని బైడెన్‌ను జెలెన్స్కీ కోరారు. ఉక్రెయిన్‌కు అదనంగా ఐదు లక్షల డాలర్ల సాయాన్ని అందిస్తామని, యాంటీ ట్యాంక్ క్షిపణులు, ఎయిర్ సర్వైలెన్స్ రాడార్లు పంపిస్తామని బైడెన్ హామీ ఇచ్చారు.
రహస్యంగా ఆయన ఏవిధంగా అక్కడకు చేరుకున్నారో వివరాలను వైట్ హౌజ్ వెల్లడించింది. వాషింగ్టన్‌లోని ఆండ్రూస్ బేస్ నుంచి ఉదయం 4 గంటలకు బైడెన్ విమానంలో పోలాండ్‌కు బయలుదేరారు. ఆ దేశ రాజధాని వార్సాకు చేరుకున్న ఆయన అక్కడ నుంచి ప్రత్యేక రైలులో కీవ్‌కు ప్రయాణించారు. దాదాపు 10 గంటల పాటు ఆ జర్నీ సాగింది.
యుద్ధంతో సతమతం అవుతున్న ఉక్రెయిన్‌కు బైడెన్ వస్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. దాదాపు అయిదు గంటల పాటు కీవ్‌లో బైడెన్ గడిపారు. ఆధునిక చరిత్రలో అమెరికా అధ్యక్షుడు అసాధారణ జర్నీ చేసినట్లు వైట్‌హౌజ్ వెల్లడించింది.
గతంలో ఇరాక్, ఆఫ్ఘన్ దేశాలకు కూడా అమెరికా అధ్యక్షులు ఆకస్మికంగా వెళ్లారు. ఆ సమయాల్లో అమెరికా సైన్యం అండగా నిలిచింది. కానీ కీవ్ పర్యటన సమయంలో అసలు అమెరికా భద్రతా దళం ఏమాత్రం కనిపించలేదు. బైడెన్ రిస్కీ జర్నీ చేశారని, దీంట్లో ఎవరూ అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని వైట్‌హౌజ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేట్ బెడింగ్‌ఫీల్డ్ తెలిపారు.
కీవ్ పర్యటనకు వెళ్లాలన్న దానిపై శుక్రవారమే తుది నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి. కేవలం పోలాండ్‌కు మాత్రమే బైడెన్ వెళ్తున్నట్లు ఆదివారం కూడా బ్రీఫింగ్ ఇచ్చారు. కానీ ఎయిర్ ఫోర్స్ వన్ టేకాఫ్ సమయంలో కొందరు మాత్రమే అధికారులు ఉన్నారు.
మెడికల్ టీమ్, సెక్యూర్టీ ఆఫీసర్లతో ఆ విమానం బయలుదేరింది. అధ్యక్షుడు బైడెన్‌తో కేవలం ఇద్దరు జర్నలిస్టులకు మాత్రమే అవకాశం కల్పించారు. వాళ్ల వద్ద నుంచి మొబైల్ ఫోన్లను తీసుకుని మరీ ప్లేన్ ఎక్కిచారు. కీవ్‌లో బైడెన్ అడుగుపెట్టిన తర్వాతే ఆ జర్నలిస్టులకు వార్తలను రాసే అవకాశం కల్పించారు.
అయితే కీవ్‌కు బైడెన్ వెళ్లడానికి కొన్ని గంటల ముందు మాత్రం రష్యాకు సమాచారాన్ని చేరవేసినట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ తెలిపారు. వార్సా నుంచి కీవ్‌కు ట్రైన్లో బైడెన్ 10 గంటలు జర్నీ చేయడం గొప్ప విషయమని వైట్‌హౌజ్ అధికారులు చెప్పారు.