గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నగర పరిసర మున్సిపాలిటీల పరిథిలల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మూకుమ్మడిగా దాడులు చేస్తున్నాయి. వీధికుక్కలు దాడిలో ఐదేళ్ళబాలుడు చనిపోయిన ఘటన నగర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆ తర్వాత బుధవారం ఒక వంక అధికారులు కుక్కల వేట ప్రారంభించగా, మరోవంక నాలుగు ప్రాంతాలలో చిన్నారులను కుక్కలు గాయపరిచాయి.
వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్దప్రాతిపథికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు చనిపోయిన నేపథ్యంలో ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఐదున్నర లక్షల వీధి కుక్కలున్నాయని, గతంలో 8 లక్షల 50 వేల ఉండేవని (2011) స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ నిర్వహించడం వల్లన వాటి సంఖ్య 5 లక్షల 50 వేలకు తగ్గిందని అధికారులు తెలిపారు.
వాటికి వెంటనే ఎబిసి (ఎనిమల్ భర్త్ కంట్రోల్ ) స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించాలని, ఆయా కాలనీలల్లో కొన్ని వాటర్ పాయింట్స్ ( నీటి నిల్వ సదుపాయం) ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, ఫంక్షన్ హాల్స్, చికెన్ సెంటర్స్, మటన్ సెంటర్లు వ్యర్థపదర్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
నగరంలో వీధి కుక్కల సంఖ్య పెరిగె అవకాశం ఉన్నందున వాటిని నిరోధించడానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విధ్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. దీనికి సంబంధించిన కరపత్రాలు, హోర్డింగ్స్ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. నగర, మున్సిపాలిటీల పరిధిలల్లో ఉన్న స్లమ్డెవలప్మెంట్ ఫెడరేషన్స్, టౌన్ డెవలప్మెంట్ ఫెడరేషన్స్, రెసిడెంట్ కాలనీ వెల్ఫెర్ అసోసియేషన్స్ సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో ఉన్న ఇతర మున్సిపాలిటీలల్లో మోప్మా స్వయం సహాయక బృందాలతో నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.పెంపుడు జంతువుల నమోదు గురించి కూడా ఒక ప్రత్యేక మోబైల్ యాప్ ను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వీటిసంబంధించిన ఫిర్యాదులను మై జిహెచ్ఎంసీ యాప్ నెంబర్ 040 – 21111111 ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
నగర పరిధిలో, పరిసర మున్సిపాలిటీల పరిధిలో పెంపుడు కుక్కల సంఖ్యను గుర్తించడానికి త్వరలో మోబైల్ యాప్ ను కూడా రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆ యాప్లో సంబంధిత యజమానులు నమోదు చేసుకోవాలని తద్వారా ఒక గుర్తింపు కార్డును కూడా మంజూరు చేయనున్నామని ఆయన పేర్కొన్నారు.
ఎక్కువగా కేసులు నమోదౌతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయ అన్నారు. ఆ ప్రాంతాల్లో వెటర్నరీ బృందాలను తరలించి వాటని కట్టడి చేయడానికి తగు చర్యలు చేపట్టాలని, మూసి పరివాహక ప్రాంతంలో కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.