వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన పీజీ విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచింది. విద్యార్థిని ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్ వైద్యుల ప్రత్యేక బృందం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాటు ప్రీతి తుదిశ్వాస విడిచినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు.
రాత్రి 9.10 గంటలకు ప్రీతి మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రీతి మృతి నేపథ్యంలో నిమ్స్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఆసుపత్రి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రీతీ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ రూ. 30 లక్షల తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రీతి మృతి తర్వాత అర్ధరాత్రి వరకు హైదరాబాద్ నిమ్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించకుండా కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి.
దీంతో పోలీసులు ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత వారు అంగీకరించడంతో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఈ ఉదయం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో వారు తమ స్వస్థలమైన జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించారు.
సీనియర్ వేధింపులను తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది. విద్యార్థిని కాకతీయ వైద్యకళాశాలలో పీజీ మత్తు వైద్యం (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతున్నది. సీనియర్ విద్యార్థి సైఫ్ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని ఈ నెల 22న ఆమె హానికరమైన ఇంజెక్షన్ చేసుకుని బలవన్మరణానికి యత్నించింది.
అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్ వైద్యుల బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది.
తమ కుమార్తె ఇకలేరని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తోటి స్నేహితురాలు చనిపోవడంతో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థినులు శోకసంద్రంలో మునిగిపోయారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామం ప్రీతి స్వగ్రామం. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్నారు.
ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే డిపార్ట్మెంట్లో ఎఎస్ఐగా పనిచేస్తున్నారు. నగరంలోని బోడుప్పల్ వెస్ట్ బాలాజీ నగర్లో నివాసం ఉంటున్నారు. విధుల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్లి వస్తున్నారు. రవీంద్ర మూడో కుమార్తె ప్రీతి.