తెలంగాణాలో ప్రసిద్ధి పొందిన పేరిణి నృత్య కళ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. పేరిణి నాట్యం కాకతీయుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన నాట్యం అని, అటువంటి పేరిణి నాట్యానికి రాజ్‌కుమార్ నాయక్ విస్తృత ప్రచారం కల్పిస్తున్నారని కొనియాడారు.
రాజ్‌కుమార్ నాయక్ తెలంగాణలోని 31 జిల్లాల్లో 101 రోజుల పాటు పేరిణి ఒడిస్సీ నిర్వహించారని, పేరిణి రాజ్‌కుమార్ పేరుతో ఆయన ప్రజలకు సుపరిచితులయ్యారని ప్రధాని పేర్కొన్నారు. కాకతీయుల కాలంలో పేరిణి నాట్యం బాగా ప్రాచుర్యం పొందిందని, ఈ నాట్య కళను శివునికి అంకితమిచ్చారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. కాకతీయ రాజవంశ మూలలు నేటి తెలంగాణకు సంబంధించినవేనని తెలిపారు.
చరిత్రను, సంస్కృతిని కళాకారులను కాపాడాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. కళను, కళాకారులను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలు ఇచ్చి సంగీత ప్రదర్శన రంగంలో కళాకారులను ప్రోత్సహించారని గుర్తుచేశారు.
ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ముఖ్యంగా ఏక్తా దీవాస్కు సంబంధించి పాటలు, జోల పాటలు, ముగ్గుల పోటీలకు సంబంధించి ప్రధాని ప్రస్తావించిన అంశాలలో దేశభక్తి గీతాలలో విజేతగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి. విజయ దుర్గ నిలిచారని చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
స్వాతంత్య్ర సమయయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నుంచి ఎంతో ప్రేరణ పొంది ఆమె పంపిన గీతాన్ని ప్రధాని ప్రస్తావించడం ఎంతో గర్వంగా ఉందని కొనియాడారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆంగ్లేయులపై పోరాటం చేసిన నరసింహారెడ్డి గీతం తమలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి రేనాటి సూర్యుడా ఓ వీర నరసింహా గీతాన్ని ప్రధాని ప్రస్తావించారు.
స్వాంతంత్య్ర పోరాటంలో ఆంగ్లేయుల నిరంకుశ, అణచివేతను చూసి ఆయన రక్తం మరిగిందని ఆమె తమ గీతంలో పొందుపర్చారని ప్రధాని పేర్కొన్నారు.మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏపీకి చెందిన మహిళ టి.విజయదుర్గ పాడిన పాటను వినిపించారు. ఈ సారి దేశభక్తియుత పాటలు పాడిన వారి గురించి మాట్లాడిన ప్రధాని.. తెలుగులో పాటను రాసి పంపించిన ఏపీకి చెందిన స్వతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డిపై టి.విజయ దుర్గ అనే మహిళ పాడిన 27 సెకన్ల ఆడియో క్లిప్‌ని అందరికీ వినిపించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్య వ్యక్తీకరణకు మీరంతా ‘మన్ కీ బాత్’ను అద్భుతమైన వేదికగా మార్చుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు.