విద్య, క్రీడలకు సమాన ప్రాముఖ్యత ఇవ్వాలని, జీవితంలో రెండూ ముఖ్యమైనవి కాబట్టి విద్యార్థులు రెంటిపై దృష్టి పెట్టాలని రెండు సార్లు బ్యాడ్మింటన్ లో ఒలింపిక్ పథకాలు సాధించిన పద్మభూషణ్ పి.వి. సింధు సూచించారు.
విట్ యూనివర్సిటీలో రెండు రోజుల విటోపియా 2023 వార్షిక క్రీడలు, సాంస్కృతిక ఉత్సవం ఆదివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొంటూ క్రీడలు ప్రజలను శారీరకంగా దృఢంగా చేస్తాయని, శారీరక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవని తెలిపారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఎంబీఏ పూర్తి చేశానని ఆమె తెలిపారు.
విట్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోటారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొంచుకోవటానికి చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. విటోపియా 2023 అనేది విద్యార్థులకు వారి క్రీడా, సాంస్కృతిక నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడే గొప్ప వేదికని చెప్పారు.
ఇతర విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు రావడం విశేషమని చెబుతూ విటోపియా విద్యార్థుల నైపుణ్యాలను ప్రదర్శించడానికి, క్రీడలలో రాణించడానికి దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఉమ్మడి వేదికపైకి తీసుకువస్తుందని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్శిటీకి 48 విశ్వవిద్యాలయాలు , కాలేజీలకు చెందిన విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చారని చెప్పారు.
విటోపియా 2023లో ప్రపంచ పారాలింపిక్ వాలీబాల్ గేమ్‌కు ఇండియా తరఫున ఆడే పారాలింపిక్ వాలీబాల్ జట్టును ఎంపిక చేయడం గర్వకారణమని తెలిపారు. సాంస్కృతిక పోటీలలో విజేతలకు తెలుగు చిత్ర పరిశ్రమ డైరెక్టర్ బాబీ కొల్లి, తెలుగు, పంజాబీ కథానాయిక పాయల్ రాజపుత్ చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరిగింది. అనంతరం ఫాషన్ షో అందరిని ఆకట్టుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ బృందంచే సాగిన గీతాలాపన అందరిని మంత్రముగ్దుల్ని చేసింది.