తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. సమీప పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. చెన్నకేశరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి గెలిచారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రేరణతో విద్య రంగంలో జాతీయవాద భావజాలాన్ని విస్తరించడానికి, భారతీయ సాంస్కృతిక వైభవ పునరుజ్జీవనానికి పనిచేస్తున్న అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ (ఎబిఆర్ఎస్ఎస్)కు అనుబంధంగా పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ టిపియుఎస్) అభ్యర్థిగా ఎవిఎన్ రెడ్డి గెలుపొందారు.
గురువారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు లెక్కింపు పూర్తయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా.. ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ దక్కలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థుల్లో ఎవరికీ గెలుపునకు అవసరమైన ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ పద్దతిలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు.
మూడో స్థానంలో ఉన్న టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్ రెడ్డి విజయం ఖరారైంది. మొత్తం 29,720 ఓట్లకు గాను 25,868 ఓట్లు పోలవగా, అందులో 452 ఓట్లు చెల్లకుండా పోయాయి.
మిగిలిన 25,416 ఓట్లలో గెలుపునకు కావాల్సిన 12,709 ఓట్లు ఏ ఒక్క అభ్యర్థికి రాకపోవడంతో ఎలిమినేషన్ పద్దతిలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.