సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్) కుటుంబంలో చేరికల చిచ్చు రేగింది. ఆదివారం కాంగ్రెస్‌లో చేరిన డిఎస్ సోమవారం రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు డిఎస్ రాజీనామా లేఖను పంపా రు. డిఎస్ రాజీనామా లేఖను ఆయన భార్య ధర్మపురి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు.
కాంగ్రెస్ వాళ్లు, మీడియా వాళ్లు తమ ఇంటికి రావొద్దని విజయలక్ష్మి కోరారు. రాజీనామ లేఖను కూడా చూపించారు. డిఎస్‌కు ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారు. “నమస్తే ఇది డీ శ్రీనివాస్ రాజీమానా ..నేను చెప్పదల్చుకున్నది ఏంటీ అంటే కాంగ్రెస్ వాళ్లు కానీ..మీడియా వాళ్లు కానీ ఇటువైపు రాకండి.” .అని విజయలక్ష్మీ వీడియోలో స్పష్టం చేశారు.
“ఇది రాజకీయాలు చేసే సమయం కాదు..డీఎస్ ను పార్టీలో చేర్చుకునే విధానం ఇది కాదు..డీఎస్ అనారోగ్యంతో ఉన్నారు. మీ రాజకీయాలకు డీఎస్ ను వాడుకోవద్దు” అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.
అటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్ తెలిపారు. తనను వివాదాల్లోకి లాగొద్దని డీఎస్ విజ్ఞప్తి చేశారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని స్పష్టం చేశారు. 8 ఏళ్ల కిందట కాంగ్రెస్‌ను వీడిన డిఎస్ బిఆర్ఎస్లో చేరారు. కొంతకాలానికి ఆ పార్టీకి దూరమయ్యారు.
మరోవైపు డిఎస్ ఇద్దరు కుమారులలో ఒకరైన ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు. ఆయన నిజామాబాద్ ఎంపీ. అయితే ఆదివారం పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన నిజామాబాద్ మాజీ మేయర్. సంజయ్‌తో పాటు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ వీల్ ఛైర్లో గాంధీ భవన్‌కు వచ్చిన డిఎస్ అక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
“నా సోదరుడు అర్వింద్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. అర్వింద్ దిగజారి వ్యవహరిస్తున్నారు. రాజీనామా లేఖలు బిజెపి ఎంపి చేస్తున్న ‘డర్టీ పాలిటిక్స్’. ఆదేశిస్తే అ ర్వింద్పై పోటీ చేస్తా. బ్లాక్ మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారు” అంటూ పెద్ద కుమారుడు సంజయ్ ఆరోపించారు.
కాగా, తన తండ్రి డిఎస్ రాజీనామాతో తనకెలాంటి సంబంధం లేదని నిజామాబాదు ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. తనపై సోదరుడు సంజయ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటూ తాను బిజెపి వాదినే అని పేర్కొంటూ తాను ఆయనను బీజేపీలో చేర్పించే ప్రయత్నం చేయడం లేదని తేల్చి చెప్పారు. చివరి వరకు తన తండ్రి కాంగ్రెస్‌వాదే అని తెలిపారు.
అయితే, డిఎస్‌కు రక్షణ కల్పించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి తెలంగాణ డిజిపి అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. డి శ్రీనివాస్‌కు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహానీ వుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.