మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలోని శ్రీ రామ నవమి వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని పటేల్ నగర్ ప్రాంతంలోని శ్రీ బాలేశ్వర మహదేవ్ జులేలాల్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో పలువురు భక్తులు మెట్లబావిలో పడిపోగా, వారిలో మృతుల సంఖ్యా 35కు చేరింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పై కప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో 50 మందికి పైగా భక్తులు అందులో పడిపోయారు. వారిలో 35 మంది వరకు మృతి చెందగా, మరో 18 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు.
నిచ్చెన సాయంతో బావిలో పడ్డ వారిని బయటకు తీసుకొచ్చారు పోలీసులు. బావి లోతు 50 అడుగులపైనే ఉండటంతో భక్తులకు తీవ్ర గాయాలైనట్లు పోలీసుల విచారణలో తేలింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో అధికంగా మహిళలే ఉన్నారు.
పటేల్ నగర్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ప్రాంగణంలో తరాల నుంచి శ్రీరామ నవమి ఆచారం ప్రకారం మెట్లబావి వద్ద అగ్నిక్రతువు హోమం జరుగుతుంది. దీనిని తిలకించేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ దశలోనే పలువురు బావి పై కప్పుపై కూడా కూర్చున్నారు.
ఆలయ ఆవరణలో ఉన్న మెట్ల బావి నిరూపయోగంగా ఉండటంతోనే దానిపై స్లాబ్ వేశారు. అనంతరం దాన్ని ఆలయ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఒకేసారి అధిక సంఖ్యలో భక్తులు కూర్చోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.