జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మల్లన్నకు వ్యతిరేకంగా ఎలాంటి ఖైదీ అప్పగింత (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ – పీటీ) వారెంట్లు జారీ చేయకూడదని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.
మల్లన్నపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదయిన కేసులను సవాల్ చేస్తూ ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న మీద 90 కేసులు నమోదు చేశారని ఆయన తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒక్కో కేసులో పిటి వారెంట్ పేరుతో బయటకు రాకుండా మల్లన్నను వేధిస్తున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా మలన్నపై ఎన్ని కేసులు బుక్ చేస్తారని పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు.. 90 కేసులు బుక్ చేయడం సరైంది కాదని సూచించింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు… ఒకే రకమైన ఫిర్యాదులపై అనేక కేసులను నమోదు చేయడం ఆ వ్యక్తి ప్రాథమిక హక్కులను హరించడం అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఇపుడు నమోదయిన రెండు కేసులు మినహా మిగతా కేసుల్లో పిటి వారెంట్ కోసం పోలీసులు అడగొద్దని ఆదేశించింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించిన హైకోర్ట్ తదుపరి విచారణ ఏప్రిల్10కి వాయిదా వేసింది, మల్లన్నపై ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్ని కేసుల్లో పీటీ వారెంట్లు జారీ చేశారు? తదితర వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులను ఆదేశించింది.
మార్చి 21న సాయి కరణ్ అనే వ్యక్తిపై దాడి చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేయగా.. ఆయనకు 14రోజుల రిమాండ్ విధించారు. మల్లన్నతో పాటు మరో ఆరుగురికి రిమాండ్ విధించి.. చర్లపల్లి జైలుకు తరలించారు.
ఈ కేసులో 8 మంది నిందితులుగా ఉన్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరిలో ఇప్పటికే ఆరుగురు అరెస్ట్ కాగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. మల్లన్న టీంపై మొత్తం రెండు ఘటనల్లో కేసు నమోదైనట్టు తెలిపారు.
విధుల్లో ఉన్న కానిస్టేబుల్స్ ను కిడ్నాప్ చేసి దాడి చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఫిర్జాదీగూడ, రాఘవేంద్ర భవన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను అడ్డుకున్నారన్నారు. క్యూ న్యూస్ ఆఫీస్ కి తీసుకెళ్లి దాడి చేశాని, చైన్ స్నాచర్ల కోసం వెహికల్ చెకింగ్ చేస్తుండగా పోలీసులను నిలదీశారని తెలిపారు.
మీరు ఎవరు, ఎందుకు వాహనాలు చెక్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారని చెప్పారు. మీ ఐడీ కార్డు చూపించాలని పోలీసులతో గొడవ పడ్డారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.