దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారిన పడ్డారు. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం. గత ఏడాది సెప్టెంబర్ 16న 6298 కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,47,51,259 కి చేరింది. ఇందులో5,30,954 మంది మరణించారు. ప్రస్తుం 31,194 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 11 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 0.07 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, 98.74 శాతం మంది కోలుకున్నారు.
1.19 శాతం మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63 శాతానికి పెరగడం విశేషం. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలను ( ఎమర్జెన్సీ హాట్ స్పాట్స్) గుర్తించి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
దేశం మొత్తం మీద ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచాలని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖా అన్ని రాష్ట్రాలకు హెచ్చరించింది.
ఇలా ఉండగా, కరోనా బారిన పడుతున్న పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. గతంలో కరోనా బాధితుల్లో ఈ పరిస్థితి కనిపించలేదని పేర్కొన్నారు. కాబట్టి కొత్త వేరియంట్ వల్లే కళ్లలో పుసులు, దురద వస్తుండ వచ్చని అభిప్రాయపడ్డారు.
వీటికి అదనంగా గతంలో ఉన్నట్లే అధిక జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఇప్పుడు కూడా కరోనా బాధితుల్లో కనిపిస్తున్నాయని చెప్పారు. దేశంలో కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ .1.16 లేదా ఆర్టురుస్గా పిలిచే కొత్త వేరియంట్ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్న సంగతి గమనార్హం.