వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం శుక్రవారం స్పష్టం చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లెమిటెడ్(ఆర్ఐఎన్ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలపుదల చేసినట్లు వస్త్తున్న వార్తలను కేంద్రం ఖండించింది.
స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేసింది. స్టీల్‌ప్లాంట్ పనితీరు మెరుగుకు ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ తమ వంతు కృషి చేస్తున్నాయంటూ ఈ మేరకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇప్పటికిప్పుడు స్టీల్‌ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలని అనుకోవడం లేదని, ప్లాంటును బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రమంత్రి ఫగ్గన్‌సింగ్ గురువారం విశాఖలో చేసిన ప్రకటన దీనికి నేపథ్యం. ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు వెళ్లడం లేదని, ప్రస్తుతం పూర్తిస్థాయిలో ప్లాంట్ పని చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు.
ఈ విషయంలో ఉక్కు యాజమాన్యం, కార్మిక సంఘాలతో ప్రత్యేకంగా చర్చిస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే ఆ తర్వాత కార్మికులు తదితరులతో జరిగిన భేటీల్లో మంత్రి ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో రకరకాల చర్చలకు తెర లేచింది.
మంత్రి ప్రకటనలతో ప్రైవేటీకరణ ఉంటుందా? ఉండదా అనే దానిపై స్పష్టత కరువైంది.ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై స్పష్టత ఇచ్చింది.