వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిల కారుతో ఢీకొట్టడంతో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. పోలీసులపై దాడి చేసి కారుతో ఢీకొట్టిన కేసులో షర్మిలను అరెస్ట్ చేశారు. ఎస్ఐ రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలపై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద షర్మిలపై కేసులు నమోదు చేశారు. షర్మిలను నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తున్నారు.
వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. తాను పోలీసులపై దాడి చేశానన్న వార్తలను ఖండించిన ఆమె పోలీసులపై ఎలాంటి దాడి చేయలేదని ఖండించారు. తనను అరెస్టు చేస్తుంటే వారిని అడ్డుకున్నానని వివరించారు. వైఎస్ షర్మిల అరెస్టుపై కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు.
షర్మిల సిట్ కార్యాలయానికి దగ్గరకు వెళ్తుంటే అరెస్ట్ చేశారని, అసలు షర్మిల సిట్ ఆఫీస్ కు వెళ్తే సమస్యేంటీ అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించినందుకే వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారని విజయమ్మ ఆరోపించారు. ప్రశ్నించే గొంతును ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీసుల దగ్గర్నుంచి ఎలాంటి సమాధానం లేదని ఆమె పేర్కొన్నారు.
అంతకుముందు వైఎస్ఆర్టీపీ అఫీసు ముందు ఆ పార్టీ చీఫ్ షర్మిలను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్‌పై షర్మిల చేయిచేసుకున్నారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా రోడ్డుపైనే కూర్చుని నిరసనకు దిగారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఓ మహిళా కానిస్టేబుల్ తో పాటుగా ఎస్ ఐ రవీందర్ పై షర్మిల చేయి చేసుకున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ”తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. నన్ను ఎందుకు గృహనిర్బంధం చేస్తున్నారో చెప్పాలి. వ్యక్తిగత పనులపై బయటకు వెళ్తున్నా.. అడ్డుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భయపడుతున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కోర్టు అనుమతి పొందాలా? కెసిఆర్‌కు నిజాయితీ ఉంటే పేపర్ లీకేజ్‌పై సిబిఐ విచారణ జరిపించాలి” అని డిమాండ్ చేశారు.
అరెస్ట్ తర్వాత షర్మిలను కలిసేందుకు ఆమె తల్లి విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో విజయమ్మ పోలీస్ స్టేషన్ ఎదుటే నిరసన తెలిపారు. అనంతరం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన బిడ్డను కలవడానికి కూడా ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని విజయమ్మ, పోలీసులను నిలదీశారు.
అసలు తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ లో ఉన్న కుమార్తెను పరామర్శిస్తే తప్పేంటనీ పోలీసులను ఆమె ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా తెలంగాణలో లేదా అంటూ ఆమె మండిపడ్డారు.