జాతీయ పార్టీగా బిఆర్ఎస్ ను ప్రారంభించినప్పటి నుండి ఎక్కువగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారిస్తున్న మహారాష్ట్రలో మొదటిసారి పోటీచేసిన పార్టీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి, సత్తా చాటుకుంటామని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో మూడు బహిరంగసభలలో ప్రసంగించారు. తెలంగాణ బయట బిఆర్ఎస్ బహిరంగసభలు నిర్వహించింది ఇక్కడే కావడం గమనార్హం.
త్వరలో జరుగబోయే జిల్లా పరిషద్ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు కూడా కేసీఆర్ ప్రకటించారు. అయితే, తెలంగాణ సరిహద్దులో నాందేడ్ జిల్లాలోని భోకర్ తాలూకాలో ఉన్న ప్రఖ్యాత భోకర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ 18 డైరెక్టర్ పదవులకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు పరాజయంపాలయ్యారు.
శనివారం ఓట్ల లెక్కింపు జరగ్గా.. కాంగ్రెస్ మద్దతుదారులు 13, ఎన్సీపీకి 2, బీజేపీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు డైరెక్టర్ పదవులను కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయింది. ఈ మార్కెట్‌పై పట్టున్న నాగ్నాథ్ సింగ్ ఇటీవలే కాంగ్రె్‌సను వీడి, బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే వచ్చిన మార్కెట్ కమిటీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేసింది. అయినా ఫలితం లేకపోయింది.
నాగ్నాథ్ సింగ్ నేతృత్వంలో బిఆర్ఎస్ బరిలోకి దిగిన 18 మంది అభ్యర్థులు ఉచిత హామీలను ప్రకటించినా ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. బీఆర్ఎస్ ఇక్కడ తమ మద్దతుదారులను గెలిపిస్తే తెలంగాణలో మాదిరిగా ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తామని హామీలు ఇచ్చింది. కాగా బీఆర్ఎస్ ఆగమనంతో ఫలితాలు తారుమారవుతాయని భావించినా.. ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. ఒక విధంగా ఇతర రాష్ట్రాలలో పోటీ చేసేందుకు కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలకు ఈ ఎన్నికలు పెద్ద షాక్ గా చెప్పవచ్చు.
