తీవ్రమైన ఆర్ధిక సమస్యలతో ఇప్పటికే ఓవర్ డ్రాఫ్టుల మీద నడుస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈసారి కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఊరట లభించింది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ 30,275 కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు అనుమతులు లభించాయి. కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్దిక శాఖతో పాటు రిజర్వు బ్యాంకు అధికారులకు వర్తమానం పంపారు. ఈఏడాది ఎన్నికల ఏడాది కావడంతో పాలనా పరంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సమయంగా మారింది. సంక్షేమ పథకాల అమలుతోపాటు పలు హామీలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది.
ఈసమయంలో కొత్త ఆర్దిక సంవత్సరంలో ఆర్దికంగా తోడ్పాటు గురించి కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్రం ఈప్రతిపాదనలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి ఈనిర్ణయం పెద్ద ఊరటను ఇవ్వనుంది.
ఈ నెలలో ఇప్పటికే ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుతో పాటుగా ఉద్యోగులకు సంబంధించి అరియర్స్ క్లియర్ చేయటంపై గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. జీతాలు క్లియర్ అవుతున్నా ఇంకా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి.
ఇప్పుడు ఆర్దికంగా ఉన్న ఒత్తిడి సమయంలో కేంద్రం తీసుకున్న ఈనిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఉపశమనం కల్పించినట్లయింది. 2023-24 ఆర్దిక సంవత్సరంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ 30,275 కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయించింది.
ఇప్పటికే ఏప్రిల్లో అడహక్ అనుమతులతో రూ. 6 వేల కోట్ల రుణం ప్రభుత్వం తీసుకుంది. ఈ క్రమంలో ఈ ఆర్దిక సంవత్సరంలో అంతా కలిపి రూ 24,275 కోట్ల రుణాలకు అనుమతి ఉందని తేల్చి చెప్పింది. ఈనెల 9వ తేదీనాటికి రూ.3,500 కోట్ల రుణాలు సమీకరణకు రిజర్వ్ బ్యాంకుకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.
తాజా అనుమతులతో ఏ నెలలో ఎప్పుడు ఎంత రుణం కావాలో రాష్ట్ర అధికారులు ఇండికేటివ్ క్యాలెండర్ సిద్దం చేసి రిజర్వ్ బ్యాంకుకు పంపనున్నారు. ప్రస్తుతం రుణాలకు అనుమతి లభించటంతో ఓవర్ డ్రాప్ట్ వెసులుబాటు వినియోగించుకుంటున్నారు.