తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 2 నుంచి 21 రోజులపాటు కొనసాగనున్నాయి. తొలి రోజు హైదరాబాద్‌లో తెలంగాణ సచివాలయంలో ప్రారంభిస్తారు. సచివాలయ ఉద్యోగులు సహా అన్ని శాఖల హెచ్ఓడీలు, ఉద్యోగులందరూ హాజరవుతారు.
అమరవీరులను స్మరించుకునేందుకు ఒకరోజును ప్రత్యేకంగా ‘మార్టియర్స్ డే’గా జరుపనున్నారు. అమరుల స్మారక దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి, విద్యుద్దీపాలతో వెలిగించి.. గ్రామ గ్రామాన తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ నివాళులు అర్పించాలని నిర్ణయించారు.
అలాగే జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేయాలి. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం చేయననున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు మార్టియర్స్ డేలో పాల్గొంటారు. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా అమరుల సంస్మరణ సహా ఉత్సవాల్లో పాల్గొంటాయి.
మరో 20రోజుల పాటు వరుసగా ఆయా శాఖలు సాధించిన ప్రగతిని డాక్యుమెంట్ రూపంలో ప్రదర్శించాలి. ప్రతి శాఖ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని కూలంకశంగా రికార్డు చేస్తూ అన్నిశాఖలకు శాఖల వారీగా ఒక్కో డాక్యుమెంట్‌ను ప్రదర్శించాలి. ఆయా శాఖలు దేశానికే ఆదర్శంగా సాధించిన ప్రగతిని, ఈ ప్రగతి సాధించడానికి వెనుక రాష్ట్ర ప్రభుత్వం పడిన కష్టాన్ని దార్శనికతను, దృక్పథాన్ని, తాత్వికంగా విశ్లేషిస్తూ డాక్యుమెంటును రూపొందించి, సినిమా హాల్స్ టీవీలు తదితర మాధ్యమాల ద్వారా ప్రదర్శించాలి.
విద్యుత్‌శాఖకు కేటాయించిన రోజును పవర్ డే’ గా పరిగణిస్తారు. తాగునీరు, సాగునీరుకు సంబంధించి మొత్తంగా ఒకే రోజున ‘వాటర్ డే’ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని రకాల అన్ని వర్గాల సంక్షేమాన్ని గురించిన ‘వెల్ఫేర్’డేగా ప్రత్యేకంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు.
అగ్రికల్చర్ డే, పల్లె-పట్టణాభివృద్ధి డే, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డే, రెవెన్యూ డే, పరిపాలన సంస్కరణ, పోలీస్ సంస్కరణలు తెలిపేలా ప్రత్యేక రోజు, మహిళా సాధికారతను తెలిపే దిశగా ‘ఉమెన్ డే, ఇండస్ట్రీస్ ఐటీ డే, ఎడ్యుకేషన్ డే, మెడికల్ అండ్ హెల్త్ డే, ఆర్టీజన్స్ డే (వృత్తిపనులు), గ్రీన్ డే, హాండ్లూమ్ డే, ఆర్థిక ప్రగతి గురించి, మౌలిక వసతుల అభివృద్ధి తదితర శాఖలకు కేటాయించిన ఒక్కో రోజును ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు.
దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని గురించి ప్రపంచం అర్థం చేసుకునేలా కార్యక్రమాలు ఉండాలని కేసీఆర్ తెలిపారు. స్వతంత్ర భారతంలో తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణను సాధించిన దాకా సాగిన.. తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియచేసే డాక్యుమెంటరీని రూపొందించాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన, ప్రభుత్వ పాలన ప్రారంభమైన 2 జూన్ 2014 నుంచి నుంచి 2023 జూన్ 2 దాకా స్వయం పాలనలో సాగిన సుపరిపాలన అది సాధించిన ప్రగతిని గురించిన మరో డాక్యుమెంటరీని రూపొందించాలి.
గోల్కొండ కోట, భువనగిరి కోట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలను, ప్రముఖ రామప్ప సహా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలను అందంగా అలంకరించడంతో పాటు విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు. హుస్సేన్ సాగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచా పటాకులతో వెలుగులు విరజిమ్మేలా ప్రదర్శన కార్యక్రమాలను చేపట్టాలని, తమ తమ ఉద్యోగ విధుల్లో ప్రతిభ కనబరిచిన అన్నిశాఖల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి అవార్డులు అందజేయాలని నిర్ణయించారు.