తెలంగాణలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితుల జాబితా అంతకంతకు పెరుగుతోంది. ఈకేసులో తాజాగా సిట్ అధికారులు మరో నలుగుర్ని అరెస్ట్ చేశారు. దీంతో పేపర్ లీక్ కేసులో అరెస్టైన పాత్రధారులు, సూత్రధారుల సంఖ్య 35కి చేరుకుంది.
బుధవారం అరెస్ట్ చేసిన వాళ్లలో ఈ పేపర్ లీక్ స్కామ్ కేసులో సూత్రధారిగా ఉన్నటువంటి రాజశేఖర్ భార్యతో పాటు మరో ముగ్గుర్ని అదుపులోకి సిట్ అధికారులుతీసుకున్నారు. వాళ్లను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే అరెస్ట్ చేసిన వాళ్లను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సిట్ అధికారులు వాళ్లిస్తున్న సమాచారం ప్రకారం కొత్త వాళ్లను ఈవ్యవహారంతో సంబంధాలు ఉన్న వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. అయితే పేపర్ లీక్ స్కామ్లో మరికొందరు ఉన్నట్లుగా సిట్ భావిస్తోంది. వాళ్ల పేర్లను బయటకులాగి కటకటాల వెనక్కి పంపేందుకు విచారణ వేగవంతం చేస్తోంది.
బుధవారం అరెస్ట్ చేసిన నలుగురి కంటే ముందు ముగ్గురు కీలక సూత్రధారుల్ని అరెస్ట్ చేశారు. క్రాంతి, రవితేజ, శశిధర్ అనే ముగ్గుర్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఏఈఈ ప్రశ్నపత్రాన్ని క్రాంతి, శశిధర్, మురళీధరన్ వద్ద కొనుగోలు చేసినట్లుగా తేల్చారు.
అలాగే డీఈవో ప్రశ్నపత్రాన్ని సాయిలౌకిక్ వద్ద రవితేజ కొనుగోలు చేసినట్లుగా సిట్ అధికారులు తమ విచారణలో రాబట్టారు. 9రోజుల క్రితం అనగా మే9వ తేదిన కూడా నలుగుర్ని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. వాళ్లు కూడా ఏఈ, ఏఈఈ ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసినట్లుగా దర్యాప్తులో తేల్చారు.