మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీ రావుపై ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో ఆ సంస్థకు చెందిన రూ 793 కోట్ల ఆస్తులను తాజాగా జప్తు చేశారు. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై విస్తృత దాడులను నిర్వహించిన అనంతరం కేసు పెట్టిన సీఐడీ అధికారులు ఇప్పుడు ఆస్తులను అటాచ్ చేశారు. వీటి విలువ రూ. 793,50,72,460. దీనికి సంబంధించిన నోట్‌ను వారు విడుదల చేశారు.
ఛిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది మార్గదర్శి చిట్స్ సంస్థ యాజమాన్యం. అవి నిజమని తేలడంతో సీఐడీ అధికారులు ఇదివరకే కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఛిట్ ఫండ్స్ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు.
మార్గదర్శి ఛిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ల నివాసాలపై ఇటీవల విస్తృతంగా ఏపీ సీఐడీ అధికారులు సోదాలను నిర్వహించారు. మార్గదర్శి కార్యాలయాల్లో రోజంతా తనిఖీలను కొనసాగించారు. పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీరావును కూడా వారు విచారించారు.
మార్గదర్శి ఛిట్ ఫండ్ పై తొలిసారిగా 2006లో అప్పటి లోక్ సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసును హైకోర్టు 2014లో కొట్టి వేసింది. దీన్ని సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ 2020లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది.
ఇదివరకు కూడా ఏపీ సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలను నిర్వహించారు. అప్పట్లో కేసులేవీ నమోదు కాలేదు. మలి విడత సోదాల సందర్భంగా ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, కొందరు బ్రాంచ్ మేనేజర్లపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
ఐపీసీ సెక్షన్ 120 (బీ), 409, 420, 477 (ఏ) , రెడ్ విత్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు, అనంతపురం బ్రాంచిల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు.
ఈ పరిణామాల మధ్య ఇప్పుడు ఏపీ సీఐడీ అధికారులు రామోజీ రావు ఆస్తులను అటాచ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆస్తులను అటాచ్ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది. ఈ మేరకు జీఓ నంబర్ 104ను జారీ చేసింది. ఈ జీఓను హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా విడుదల చేశారు.