సచివాలయం వద్ద తుది దశకు చేరుకున్న అమరుల స్మారక స్తూపం నిర్మాణం పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అమరుల స్మారక స్తూ పం ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని, విగ్రహానికి రెండు వైపులా అత్యద్భుతమైన ఫౌంటేన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా వుండే విధంగా ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సిఎం సూచించారు.
వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులకు (హెచ్వోడీ) తరచూ సచివాలయంలో పని ఉంటున్న నేపథ్యంలో వారి కార్యాలయాలన్నీ కూడా దానికి సమీపంలో ఒకేచోట నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నూతన సచివాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తున్న నేపథ్యంలో ఆయా హెచ్వోడీల కార్యాలయాలను ఒకేచోటకు చేర్చడంపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో చర్చించారు.
అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వశాఖల్లోని హెచ్వోడీలు, వారి ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి సమీపంలో విశాలమైన ప్రభుత్వం స్థలాలు ఎకడెకడున్నాయో ఆరా తీశారు.
స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు, హెచ్వోడీల కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా ట్విన్ టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు. సమీకృత సచివాలయం తరహాలోనే సమీకృత హెచ్వోడీల కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
ఆ తరువాత బీఆరే భవన్ వద్ద నిర్మించిన వంతెనలను పరిశీలించారు. నూతన సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చూసేందుకు ఈ వంతెనలను నిర్మించారు. సచివాలయం ప్రారంభించుకుని నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో సచివాలయంలో మౌలిక వసతులు పూర్తవ్వడం గురించి, సౌకర్యాలు అందుబాటులోకి రావడం గురించి సీఎస్ శాంతకుమారిని సంబంధిత ఉన్నతాధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు.
