తెలంగాణలో ఆదివారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటివరకు ఎండ మండిపోగా ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి వాతావరణమంతా చల్లబడిపోయింది. కాసేపటికే జల్లులు కురిశాయి. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన కుండపోత వాన కురిసింది.
రాగల నాలుగు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో వారం రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతాయని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఎండ, వేడిగాలులతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచన చల్లని కబురు అందించింది. నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
గాలి వేగం గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని తెలిపింది. పలు జిల్లాలు ఆదిలాబాద్, కుమ్రంభీంఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని హెచ్చరించింది.
మిగిలిన చోట్ల అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 9 వరకు పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. మరోవారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.
ఈ నెల 7 వరకు వడగాలుల తీవ్రత కొనసాగుతుందని స్పష్టం చేసింది. వారం రోజులపాటు రాష్ట్ర మంతటా గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.