కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొవిన్ పోర్టల్ టెలిగ్రామ్‌లో లీకైంది. కరోనా వ్యాక్సిన్ డోస్‌లను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టల్‌లో దేశ ప్రజల సమాచారాన్ని నిక్షిప్తం చేసింది. ఈ కొవిన్ పోర్టల్‌లో సమాచారం లీక్ కావడంతో ప్రజల ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ సమాచారం, పాస్‌పోర్ట్ నెంబర్ సహా పుట్టిన తేదీ, వ్యాక్సిన్ పొందిన ప్రాంతం తదితర సమాచారం మొత్తం లీకైనట్లు తెలుస్తోంది.
అలాగే వ్యాక్సిన్ ఎన్ని డోసులు తీసుకున్నారన్న సమాచారంతో పాటు ఫోన్ నెంబర్లు కూడా లీకయ్యాయి. ఫోన్ నెంబర్‌కు బదులుగా ఆధార్ నెంబర్‌ను నమోదు చేసినప్పటికీ ఈ వివరాలు మొత్తాన్ని పొందవచ్చని మొదటగా మలయాళ వెబ్సైట్ ది ఫోర్త్ న్యూస్ నివేదించింది. ఎవరు యాక్సెస్ చేసినా సమాచారం అందుబాటులోకి వచ్చే విధంగా ఉంది.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి, కాంగ్రెస్ నేతలు కెసి. వేణుగోపాల్, జైరాం రమేష్, పి. చిదంబరం, టిఎంసి నేత డెరెక్ ఒ బ్రెయిన్, ఇండియా టుడే జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయి, మోజో స్టోరీకి చెందిన బర్ఖా దత్ వివరాలు కూడా లీకైనట్లు తెలుస్తోంది.
రాజేష్ భూషణ్ నెంబర్‌ను నమోదు చేసినపుడు ఉత్తరాఖండ్‌లోని కోటి ద్వార్ ఎమ్మెల్యే అయిన ఆయన భార్య రీతూ ఖండూరీ వ్యక్తిగత వివరాలతో పాటు ఆధార్ నెంబర్, పుట్టిన తేదీతో సహా వివరాలు వెల్లడయ్యాయి.
అయితే, కొవిన్ వెబ్‌సైట్‌తో సమాచారం లీకయ్యే ప్రమాదం ఉందన్న వాదనను రెండేళ్ల క్రితం సరిగ్గా 2021 జూన్ 12న నేషనల్ హెల్త్ అథారిటీ సిఇఒ ఆర్ఎస్. శర్మ కొట్టిపారేశారు. 2021లో కొవిన్ పోర్టల్‌ను హ్యాక్ చేసి, 15 కోట్ల మంది డేటాబేస్‌ను విక్రయించినట్లు నివేదికలు వెల్లడైనప్పుడు, ఈ నివేదికలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
డార్క్ వెబ్‌కి చెందిన హ్యాకర్స్ కొవిన్‌ను హ్యాక్ చేశారని, డేటా లీకైందనే ఆరోపణలు నిరాధారమైనవని నేషనల్ హెల్త్ అథారిటీ సిఇఒ ఆర్ఎస్. శర్మ పేర్కొన్నారు. ఆయన కొవిన్పోర్టల్కు హెడ్‌గానూ, ఎంపవర్డ్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్ (ఇజివిఎసి) గానూ వ్యవహరిస్తున్నారు.