దేశంలోని ప్రముఖులు, పౌరుల వ్యక్తిగత వివరాల కొవిన్ పోర్టల్ నుంచి లీకయ్యాయని వచ్చిన వార్తలు అసత్య ప్రచారాలు అని కేంద్ర ఆరోగ్య శాఖకొట్టి పారేసింది. ఆరోగ్యశాఖకు సంబంధించిన కొవిన్ పోర్టల్ పూర్తిగా సురక్షితమని తేల్చి చెప్పింది.
కొవిన్ పోర్టల్లోని ప్రముఖులు, రాజకీయ నేతలు సహా సామాన్య పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉందని, ఎలాంటి భయాలు వద్దని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగత సమాచారం లీకైందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని వెల్లడించింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని సీఈఆర్టీని కేంద్రం కోరింది.
కొవిన్ పోర్టల్ పూర్తిగా సురక్షితమైందని, అందులోని సమాచారాన్ని రహస్యంగా ఉంచేందుకు వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్, యాంటీ – డీడీఓఎస్, రెగ్యులర్ వల్నరబిలిటీ అసెస్మెంట్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇలా అన్ని భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్లు వెల్లడించింది.
ఓటీపీ వినియోగించి మాత్రమే కొవిన్ పోర్టల్లోని సమాచారాన్ని చూడగలమని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఓటీపీ లేకుండా కొవిన్ పోర్టల్లోని సమాచారాన్ని చూడలేమని స్పష్టం చేసింది. డేటా లీక్ వార్తలపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సీఈఆర్టీని కేంద్రం కోరింది.
సోషల్ మీడియాలో వచ్చిన డేటా లీక్ ఆరోపణలపై ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వెంటనే స్పందించి సమీక్షించిందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి డేటా ఉల్లంఘనలు జరగలేదని తేల్చిందని తెలిపారు. కొవిన్ యాప్ లేదా డేటాబేస్లో సమాచారం ఉల్లంఘించినట్లు ఎక్కడా కనిపించ లేదని తేల్చి చెప్పారు. కొవిన్ పోర్టల్లో సమాచారం అత్యంత గోప్యంగా ఉంచుతుందని స్పష్టం చేశారు.