మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురం గ్రామం. దయాకర్ రెడ్డి మూడు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
1994, 1999లో అమరచింత నియోజకవర్గం నుండి రెండు సార్లు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో మక్తల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంకు కృషిచేసిన వారిలో దయాకర్ రెడ్డి ఒకరని ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ దయాకర్ రెడ్డి పనిచేశారు.
దయాకర్ రెడ్డి, ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డికి టీడీపీతో ప్రత్యేక అనుబంధం ఉంది. రాజకీయ జీవితం టీడీపీలోనే సుదీర్ఘకాలం కొనసాగింది. సీతా దయాకర్ రెడ్డి 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
రాష్ట్ర విభజన తరువాత కూడా వీరు కొద్దికాలం టీడీపీలో కొనసాగారు. గత ఏడాది ఆగస్టు నెలలో దయాకర్ రెడ్డి దంపతులు టీడీపీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
ఆ తర్వాత కొద్దికాలంకు దయాకర్ రెడ్డి అనారోగ్యానికి గురి కావటంతో దంపతులిద్దరూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దయాకర్ రెడ్డి మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ…సమర్థుడైన నాయకుడుగా దయాకర్ రెడ్డిపేరు తెచ్చుకున్నారని చంద్రబాబు చెప్పారు.
