టైటానిక్ షిప్ శకలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్మెర్సిబుల్ కథ విషాదాంతమైంది. తీవ్రమైన ఒత్తిడి వల్ల టైటాన్ పేలిపోయిందని, దీంతో అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికన్ కోస్ట్‌గార్డ్ ప్రకటించింది.
టైటాన్‌ను వెతికేందుకు సముద్ర గర్భంలోకి పంపించిన రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ (ఆర్వోవీ) సహాయంతో మునిగిన టైటానిక్ నౌక సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్టు వెల్లడించింది. టైటానిక్ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో టైటాన్ శకలాలు ఉన్నట్లు పేర్కొంది.
అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ శకలాలను చూడటానికి టూరిస్ట్ సంస్థ ఓషియన్గేట్ పంపిన ‘టైటానిక్ సబ్ మెర్సిబుల్’ (మినీ జలాంతర్గామి) ఆదివారం రాత్రి గల్లంతైంది. దీంతో అప్రమత్తమైన అమెరికా, కెనడా రక్షణ బృందాలు . టైటాన్ ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి.
దాదాపు 13 వేల అడుగుల లోతున్న చోట ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను జారవిడిచారు. పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలోకి దించారు. అయితే గల్లంతైన సబ్మెర్సిబుల్ తీవ్రమైన ఒత్తిడి వల్ల పేలిపోయిందని, అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు చనిపోయారని అమెరికన్ కోస్ట్‌గార్డ్ నిర్ధారించింది.
పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19), బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఈ యాత్ర నిర్వాహకుడు స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ ఈ జలాంతర్గామిలో ఉన్నారు. అయితే మూడు రోజుల నుంచి వీరి ఆచూకీ గల్లంతయ్యింది. దీంతో కెనడా, అమెరికా తీర రక్షక దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి.
మరోవైపు వీరు ప్రయాణిస్తున్న టైటాన్లో కేవలం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలే ఉండడంతో క్షణక్షణం ఉత్కంఠగా మారింది. కాగా, ఈ సాహసయాత్రలో పాల్గొనేందుకు ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు రూ.రెండు కోట్లు వసూలు చేశారు. అంతకుముందు టైటాన్లో ప్రయాణిస్తున్న ఐదుగురు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నట్లు ఓషన్‌గేట్ సంస్థ పేర్కొంది.
”ఈ ఐదుగురు నిజమైన అన్వేషకులు. ప్రపంచ మహాసముద్రాల అన్వేషణ, రక్షణలో వీరు ఎంతో అభిరుచిని కలిగిఉన్నారు. ప్రస్తుత ఈ విషాద సమయంలో వీరి కుటుంబాల గురించే మా ఆలోచనలు ఉన్నాయి. ఈ ఘటనకు చింతిస్తున్నాం ” అని ఓషన్ గేట్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
