భారత్ ఎదగటమే కాకుండా త్వరిత గతిన అభివృద్ది చెందుతున్నామని చెబుతూ భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మూడు రోజుల అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ ప్రపంచాభివృద్ధి భారత్ – అమెరికా కలిసి నడవాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పరోక్షంగా పాకిస్థాన్ కు హెచ్చరికలు చేశారు. ప్రపంచంలోనే భారత్ ప్రస్తుతం మూడో అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా మారుతోందని వివరించారు. 9/11 దాడులు,26/11 దాడులను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. దశాబ్దాల కాలం గడుస్తున్నా ఉగ్రవాదం ఇప్పటికీ ప్రమాదకరంగా ఉన్నాయని ప్రధాని స్పష్టం చేశారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో ఎలాంటి సందేహాలకు తావు ఉండకూడదని తేల్చి చెప్పారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై గౌరవం , వివాదాలను శాంతియుతంగా పరిష్కరించటం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించటం పైనే గ్లోబల్ ఆర్దర్ ఆధారపడి ఉందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా మోదీ హితవు చెప్పారు.
మోదీ ప్రసంగం సమయంలో చాలాసార్లు సభ్యులు లేచ నిలబడి మోదీ..మోదీ అని నినాదాలు చేస్తూ చప్పట్లు కొట్టారు. సభ్యుల కరతాళ ధ్వనులతో సభ మార్మోగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను అమెరికా అక్కున చేర్చుకుని సముచిత స్థానం కల్పించిందని తన ప్రసంగంలో మోదీ తెలిపారు.
భారతీయ మూలాలు ఉన్న అనేకమంది అమెరికా ఉన్నారని, అమెరికా పార్లమెంట్ లో కూడా ఉన్నారన్నారని గుర్తు చేశారు. భారతీయ మూలాలు కలగిన కమలాహారిస్ చరిత్ర సృష్టించారని ఆయన కొనియాడారు. అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగం తరువాత ప్రధాని మోదీ శ్వేతసౌధం లో అధ్యక్షుడు బైడెన్ ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్ కు హాజరయ్యారు. భారత్ – అమెరికాకు చెందిన అధికార..పారిశ్రామిక దిగ్గజాలు ఈ విందులో పాల్గొన్నారు.
పలు కీలక ఒప్పందాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి అమెరికా అధికారిక పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. వీటితో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. విద్య, వాణిజ్య, రక్షణ, సాంకేతిక, అంతరిక్ష రంగాల్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలకు ప్రధాని మోదీ అమెరికా పర్యటన తెర తీసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని భారత్ సహకారంతో సవాలు చేయాలని అమెరికా యోచిస్తోంది.
ఇవే కీలక ఒప్పందాలు..
- అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ భారత్ లో భారత యుద్ధ విమానాలకు ఉపయోగపడే జెట్ ఇంజిన్ లను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు సంబంధించి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో జీఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
- అమెరికా నేవీకి చెందిన నౌకలకు భారత్ లోని నౌకాశ్రయాల్లో మరమ్మతుల కోసం ఆగడానికి అనుమతి లభించింది.
- అమెరికా నుంచి సాయుధ ఎంక్యూ- 9బీ సీ గార్డియన్ డ్రోన్స్ ను భారత్ కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందం కుదిరింది.
- అమెరికా సంస్థ ‘మైక్రాన్ టెక్నాలజీస్’ భారత్ లో ఒక సెమీ కండక్టర్ టెస్టింగ్ అండ్ ప్యాకేజింగ్ యూనిట్ ను ప్రారంభించడానికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. 2.7 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ యూనిట్ ను గుజరాత్ లో ఏర్పాటు చేస్తారు.
- అమెరికాలోని భారతీయ ఉద్యోగులు తమ హెచ్ 1 బీ వీసాను అమెరికాలోనే రెన్యువల్ చేసుకునే అవకాశం.
- భారత్ లో బెంగళూరు, అహ్మదాబాద్ ల్లో కొత్తగా యూఎస్ కాన్సులేట్ల ఏర్పాటు.
- 2024 లో ఇస్రో, నాసాల ఆధ్వర్యంలో భారత్ – అమెరికాల సంయుక్త స్పేస్ మిషన్.