హైదరాబాద్‌లో స్కైవేలు, స్కై వాక్స్ కోసం రక్షణ శాఖ భూములు కేటాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. స్కైవేలు, స్కై వాక్స్ కోసం రక్షణ శాఖ భూములు కేటాయిస్తే.. ల్యాండ్ ఫర్ ల్యాండ్ కూడా ఇస్తామని, తొమ్మిదేండ్ల కాలంలో ఐదుగురు రక్షణ శాఖ మంత్రులను 15 నుంచి 20 సార్లు కలిశామని కేటీఆర్ గుర్తు చేశారు.
స్వయంగా ప్రధానిని ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసారని చెప్పారు. హైదరాబాద్ నగరం భారతదేశంలోనే శరవేగంగా విస్తరిస్తున్న నగరం అంటూ ఐటీ ఉద్యోగాల్లో 44 శాతం ఉద్యోగాలు ఒక్క హైదరాబాద్ నుంచే వస్తున్నాయని తెలిపారు. మరో వైపు వ్యాక్సిన్ ప్రొడక్షన్‌కు హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా మారిందని, ఫార్మా, బయోటెక్ రంగంలో అదే విధంగా ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో కూడా అత్యంత కీలకమైన నగరంగా ఎదిగిందని వివరించారు.
ఏ రకంగా చూసినా ఈ నగరం జాతి నిర్మాణానికి ఉపయోగపడే నగరం కాబట్టి.. మాకు మౌలిక వసతుల కల్పనలో సహాయం అందించమని కోరామని వివరించారు. ఇవాళ ప్రత్యేకంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ప్రత్యేకంగా నాలుగు విషయాలు విజ్ఞప్తి చేయడం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.
“జేబీఎస్ నుంచి రాజీవ్ రహదారి వరకు స్కైవే నిర్మాణానికి 96 ఎకరాల ల్యాండ్ ఇవ్వమని కోరాం. దానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమిని కేటాయిస్తామని చెప్పాం. ప్యాట్నీ నుంచి నాగ్‌పూర్ హైవే వరకు 18.5 కిలోమీటర్ల మేర స్కైవే నిర్మించాలని అనుకుంటున్నాం. దాని కోసం 56 ఎకరాలు ఇవ్వాలని కోరాం. దీనికి కూడా ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం” అని కేటీఆర్ వివరించారు.
ఈ రెండు స్కైవేలకు డీపీఆర్ కూడా సిద్ధమై ఉందని, కేంద్రం అనుమతిస్తే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వెంటనే పనులు ప్రారంభిస్తాం అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో స్కైవాక్స్ కడుతున్నామంటూ ఉప్పల్‌లో స్కైవాక్ పూర్తయిందని, సోమవారం ప్రారంభించబోతున్నామని చెప్పారు.
మెహిదీపట్నం రైతుబజార్ వద్ద కూడా స్కైవాక్ కట్టబోతున్నామని, అయితే దురదృష్టావశాత్తు అక్కడ కూడా రక్షణ శాఖ భూములు ఉన్నాయని తెలిపారు. అక్కడ ఒక అర ఎకరం ల్యాండ్ కావాలని కోరారు. హైదరాబాద్ మహానగరంలో కొత్తగా పెద్ద ఎత్తున లింక్ రోడ్డులు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ దాదాపు 142 లింక్ రోడ్లను ప్లాన్ చేశామని తెలిపారు.
అందులో రెండు, మూడు కారిడార్లకు సంబంధించి రక్షణ శాఖ భూములు అడ్డు వస్తున్నాయని చెప్పారు. వీటన్నింటిని కేంద్ర రక్షణ మంత్రి సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.