భారతదేశంలో అవినీతి పద్ధతులు, క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ, ప్రముఖ హిందీ వార పత్రిక పాంచజన్య అమెజాన్‌పై దాడి చేసిన కొన్ని నెలల తర్వాత, భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు మంజూరు చేసిన అన్ని అనుమతులను ఉపసంహరించుకోవాలని స్వదేశీ జాగరణ్ మంచ్ ( ఎస్జెఎం) డిమాండ్ చేసింది.
గ్వాలియర్ లో ముగిసిన రెండు రోజుల జాతీయ మహాసభలలో ఆమోదించిన ‘ప్కార్ట్-వాల్‌మార్ట్ భారత్‌లో పనిచేయడానికి అమెజాన్‌కు అనుమతులను ఉపసంహరించుకోండి’ అనే తీర్మానంలో వారి కార్యకలాపాలన్నీ చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని స్పష్టం చేసింది.
ఈ కంపెనీల వ్యవహారాలపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ, “విచారణ నిస్పక్షపాతంగా జరిగేందుకు వీలుగా ఈ సంస్థల నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లబ్ధి పొందుతున్న ఉన్నత కార్యాలయాల్లో కూర్చున్న వ్యక్తులతో సహా ప్రభుత్వ అధికారుల జాడ కనిపించిన వెంటనే, వారిని సెలవుపై పంపాలి. వారు పాల్పడిన నేరాలకు తగు శిక్షలను విధించాలి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఈ ఏడాది సెప్టెంబరులో, పాంచజన్య అమెజాన్ పై ప్రచురించిన కవర్ పేజీ కధనంలో ఈ రిటైల్ దిగ్గజంను ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చుతూ పలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడిందని ఆరోపించింది. ప్రైమ్ వీడియోల ద్వారా హిందూ విలువలపై దాడి చేసిందని మండిపడింది. భారతదేశాన్ని “క్రైస్తవీకరణ” చేయడంలో ఈ కంపెనీ ప్రమేయం ఉందని, రెండు క్రైస్తవ సంస్థలకు నిధులు సమకూరుస్తోందని కూడా పత్రిక ఆరోపించింది.
“అమెజాన్, వాల్‌మార్ట్/ఫ్లిప్‌కార్ట్ వంటి బహుళజాతి ఇ-కామర్స్ కంపెనీలు భారతదేశంలో స్పష్టంగా నిబంధనలకు విరుద్ధంగా, నియంత్రణ లేకుండా పనిచేస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ 80 శాతం ఆన్లైన్ స్పేస్‌ను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. వారు అందించే డిస్కౌంట్లు ఆఫ్‌లైన్ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి” అంటూ స్వదేశ్ జాగరణ్ మంచ్ విమర్శించింది.
“వారు అధిక డిస్కౌంట్లను అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తున్నారు, అటువంటి ఆఫర్లను సాధారణ ప్రజలకు తెలియజేయడానికి దూకుడుగా ప్రకటనలు చేస్తున్నారు. సౌలభ్యం కంటే రాయితీల కోసం ప్రజలు వారి వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఈ ట్రెండ్ మన ఇరుగు పొరుగు దుకాణాలు, కిరానా దుకాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది” అని ఎస్జెఎం ఆందోళన వ్యక్తం చేసింది.
అమెజాన్ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ “చట్టపరమైన, వాణిజ్య రుసుముల ద్వారా లంచాలు చెల్లించడం కొత్త పద్ధతి కాదు. అమెజాన్ తన చట్టపరమైన వ్యాపార కార్యకలాపాల కోసం అనేక న్యాయ సంస్థలను నియమించుకుంది. అమెజాన్ ఈ లా కంపెనీలకు భారీ మొత్తంలో చట్టపరమైన రుసుము చెల్లిస్తుంది. ఆ తర్వాత ఈ కంపెనీలు ఆ రుసుమును వేరే కంపెనీకి బదిలీ చేస్తాయి ఆ తర్వాత ఒక లింక్ ఏర్పడుతుంది. చివరకు తుది చట్టపరమైన కంపెనీ లేదా న్యాయవాది లేదా ఏదైనా ప్రొఫెషనల్ సంబంధిత అధికారికి నగదు రూపంలో మొత్తాన్ని విత్‌డ్రా చేస్తారు” అంటూ మంచ్ వివరించింది.
అటువంటి కంపెనీలు పొందిన అన్ని లైసెన్స్‌లు, అనుమతులు అన్యాయమైన మార్గాలను ఉపయోగించి మోసపూరితంగా పొందాయని ఇది రుజువు చేస్తుందని స్పష్టం చేసింది. ఇ-కామర్స్ కంపెనీలు తమ ఆర్థిక పత్రాలను ఆడిట్ చేయమని, వాటిని పబ్లిక్‌గా ఉంచాలని ఎస్ జె ఎం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నది. కానీ ఈ కంపెనీలు తమ పత్రాలను బహిరంగ పరచడానికి నిరాకరిస్తున్నాయని మండిపడింది.
క్లౌడ్‌టైల్, అప్పారియోతో సహా ఎంపిక చేసిన విక్రయదారుల సమూహానికి అమెజాన్ ప్రాధాన్యతనిస్తుందని, భారతీయ ఎఫ్‌డిఐ నిబంధనలను అతిక్రమిస్తున్నదని, సోలిమో, అమెజాన్ బేసిక్స్ వంటి పోటీ ఉత్పత్తులు, బ్రాండ్లను ప్రారంభించేందుకు దాని స్వంత విక్రేతల నుండి డేటాను సేకరించిందని ఎస్జెఎం ఆరోపించింది.
“భారత్‌లో అమెజాన్ చాలా శక్తివంతంగా మారింది. అది విజేతలను లేదా ఓడిపోయినవారిని ఎంపిక చేయగలదు, చిన్న వ్యాపారాలను నాశనం చేయగలదు, వినియోగదారులపై ధరలను పెంచగలదు. ఉద్యోగులను పని నుండి తొలగించగలదు” అంటూ అమెజాన్ సృష్టించే ప్రతి ఒక ఉద్యోగానికి మరో పది ఉద్యోగాలను నాశనం చేస్తుందని ఈ సంస్థ వెల్లడించింది.
“అమెజాన్ స్టార్టప్‌లతో పెట్టుబడి ప్రతిపాదనలతో సమావేశమై, స్టార్టప్‌ల వృద్ధికి అలాగే దేశంలో వ్యవస్థాపకత సంస్కృతికి అత్యంత హానికరమైన పోటీ ఉత్పత్తులను విడుదల చేస్తుంది. అమెజాన్ తన ఇ-కామర్స్ రిటైల్ కార్యకలాపాలతో పాటు ఇటుక, మోర్టార్ రిటైల్ అవుట్లెట్లను కొనుగోలు చేయడానికి ఉత్సాహంగా ఉంది. షాపర్స్ స్టాప్, మోర్ రిటైల్ చైన్‌లో దాని పెట్టుబడి ఈ దిశలో కొన్ని ప్రధాన దశలు” అని ఆ తీర్మానం వివరించింది.