బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కేంద్ర హోంశాఖ భద్రతను కల్పించనున్నట్లు తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని తాజాగా ఈటల రాజేందర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈటలకు `వై’ కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఈటెల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతుందని ఆయన భార్య జమున బుధవారం మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. ఈటెలను హత్య చేయడానికి రూ.20 కోట్లు కోట్లు ఖర్చు చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారని పేర్కొంటూ కేసీఆర్ ప్రోత్సాహకంతోనే కౌశిక్ చెలరేగిపోతున్నారని ఆమె మండిపడ్డాయిరు.
తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఈటల రాజేందర్ కూడా ఆరోపణలు చేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ కొన్ని నెలలుగా తనను బెదిరిస్తున్నారని చెప్పారు. అయితే, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు. తనది భయపడే జాతి కాదని అన్నారు. నయీం లాంటి వాళ్లు చంపడానికి రెక్కీ నిర్వహిస్తేనే భయపడలేదని గుర్తు చేశారు.
అయితే, ఈటల భార్య ఆరోపణలపై స్పందించిన కౌశిక్ రెడ్డి హత్యా రాజకీయాలు చేసే అలవాటు ఈటల రాజేందర్ కు ఉందని, ఆయన ఉద్యమకారులను ఎంతో టార్చర్ పెట్టారని ఆరోపించారు. అంతేకాదు 2001లో ఎంపీటీసీ బాల్ రెడ్డిని ఈటల హత్య చేయించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తాను ఆయనను చంపడం కాదు ఆయనే తనను చంపిస్తారనే భయం ఉందని చెప్పారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా తనను చంపేందుకు కుట్ర చేసినట్లు ఆరోపించారు.