హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు ఏర్పాటుపై రైల్వేశాఖ చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రాబోతుందని గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రానుందని స్పష్టం చేశారు.
ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు వివరాలను ఇప్పటికే కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్టు పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్(రిజనల్ రింగ్ రోడ్డు), ఔటర్ రింగ్ రైలుతో హైదరాబాద్ అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు రూట్ దాదాపుగా ఖరారైందని తెలిపారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు సర్వేకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు దేశంలోనే మొదటని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. వ్యాపార, రవాణా రంగంలో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు కీలక మార్పు తీసుకువస్తుందని చెప్పారు. విజయవాడ, గుంటూరు, వరంగల్, మెదక్, ముంబయి రైల్వే లైన్లకు ఈ ఔటర్ రింగ్ రైలు కనెక్టివిటీగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు చాలా కీలకంగా మారనుందని కిషన్‌రెడ్డి వివరించారు. కరీంనగర్ – హసన్‌పర్తి మధ్య 61 కిలోమీటర్ల రైల్వే లైన్ సర్వే కోసం కోటిన్నర రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ పనులను సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.330 కోట్లతో చేపట్టనున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.
ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం మూడింట రెండొంతుల ఖర్చును (2/3) రాష్ట్రం భరించాల్సిన ఉన్నా, అక్కడి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో మొత్తం ఖర్చును కేంద్రమే భరించనున్నట్టు తెలిపారు.
