హైదరాబాద్ మెట్రో స్టూడెంట్ పాస్ అందుబాటులోకి తీసుకొస్తుంది. విద్యార్థుల సౌకర్యార్థం శనివారం నుంచి సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్ అమల్లోకి తీసుకొచ్చామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు 20 ట్రిప్‌లకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్‌లు జర్నీ చేయవచ్చని పేర్కొన్నారు.
మెట్రో ట్రైన్ పాస్ తీసుకుంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రయాణించవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. నగరంలోని 10 మెట్రో స్టేషన్లలో స్టూడెంట్ పాస్‌లు ఇవ్వనున్నారు. జేఎన్టీయూ, విక్టోరియా మెమోరియల్, నాగోల్, రాయ్‌దుర్గ్, దిల్సుఖ్నగర్, నారాయణగూడ, బేగంపేట్, పరేడ్ గ్రౌండ్, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లలో స్టూడెంట్ మెట్రో పాస్‌లు ఇస్తారని అధికారులు వెల్లడించారు.
1998 ఏప్రిల్ 1 తర్వాత పుట్టిన విద్యార్థులందరూ ఈ పాస్ పొందేందుకు అర్హులని మెట్రో అధికారులు తెలిపారు. ఈ ఆఫర్ కింద విద్యార్థులు 20 ట్రిప్పులకు మాత్రమే నగదు చెల్లించి అన్ని జోన్లలో 30 ట్రిప్పుల వరకు ఉచితంగా జర్నీ చేయవచ్చని తెలిపారు. అయితే విద్యార్థులు తప్పనిసరిగా నూతన బ్రాండెడ్ స్మార్ట్‌కార్డు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.
ఒక విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డు మాత్రమే జారీచేస్తారన్నారు. ఆకార్డు 30 రోజుల వరకు చెల్లుబాటవుతుందని తెలిపారు. ఈ ఆఫర్ జులై 1 నుంచి 2024, మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని మెట్రో అధికారులు వివరించారు. మెట్రో పాస్ తీసుకోవడానికి విద్యార్థులు హైదరాబాద్ మెట్రో రైల్ వెబ్సైట్లో ఓ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఈ ఫామ్ లో వివరాలు నింపి ఆ అప్లికేషన్‌తోపాటు ప్రస్తుతం చదువుతున్న పాఠశాల లేదా కాలేజ్ ఐడీ కార్డ్ జిరాక్స్ మెట్రో స్టేషన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు కూడా సబ్మిట్ చేయాలని అధికారులు సూచించారు. దీంతో పాటు ప్రిన్సిపల్ సంతకంతో బోనఫైడ్ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
విద్యార్థులు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు పది మెట్రోస్టేషన్లలో పాస్ లు కొనుగోలు చేయాలని సూచించారు. సూపర్ సేవర్ మెట్రో పాస్‌లను కొనుగోలు చేసిన విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో రైలుతో అనుసంధానం గల రిలయన్స్ ట్రెండ్, 24 సెవెన్ కన్వీనియన్స్ స్టోర్లు , ఇతర వాణిజ్య సంస్థల ద్వారా రాయితీ కూపన్లు కూడా పొందవచ్చని మెట్రో అధికారులు పేర్కొన్నారు.
విద్యార్థికి పాస్ కార్డుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ కార్డును రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి మెట్రో స్టేషన్ లో ఎంటర్ అయితే ట్రిప్ బ్యాలెన్స్ నుంచి ఒక ట్రిప్ తీసేస్తారు. విద్యార్థి పాస్ స్మార్ట్ కార్డ్‌లో రూ. 45 లోడ్ చేస్తే 15 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి. ఒకసారి ఎంటర్ అయితే మీ కార్డులో 14 ట్రిప్పులు మాత్రమే ఉంటాయి.
ఒక రోజులో కార్డులో ఇచ్చిన దాని కంటే ఎక్కువ ట్రావెల్ చేస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థి ఓ రోజు ఓవర్ ట్రిప్స్ వెళ్తే రూ. 55 అవుతుంది. మీ ట్రిప్ బ్యాలెన్స్ నుంచి ఒకటి కట్ చేయడంతోపాటు అదనంగా రూ.10 చెల్లించాల్సి ఉంటుంది.