ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదు అని తేల్చి చెప్పారు. ముందుస్తు ఎన్నికల పేరుతో కొన్ని మీడియా ఛానెళ్లు హడావుడి చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
“జగనన్న సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటాం. మళ్లీ సీఎం జగన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతీ ఎమ్మెల్యేకు ప్రజలు ఇదే చెబుతున్నారు. సీఎం జగన్ పూర్తిగా పాజిటివ్ ఓటునే నమ్ముకున్నారు” అని తెలిపారు.
ముందస్తు ఎన్నికలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే మీడియా ఛానెల్స్ హడావుడి ఇదంతా ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దని సజ్జల కోరారు
చంద్రబాబు మాదిరిగా అలిపిరి ఘటనను అడ్డం పెట్టుకోవాల్సిన పని తమకు లేదని, ఆ పేరుతో చంద్రబాబు తన పార్టీని బతికించుకోవాలని చూస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. ముందస్తుపై ఎల్లోమీడియాలో రాసుకుని తమని వివరణ అడిగితే ఎలా? అని ప్రశ్నించారు.
ముందస్తు అనేది చంద్రబాబు చేసే గేమ్ ప్లాన్ మాత్రమేనని, పవన్‌తో ఐదో, ఆరు సీట్ల గురించి చర్చించుకునేందుకు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఊగిసలాడే వారిని పార్టీలోకి చేర్చుకునేందుకు చంద్రబాబు, పవన్ ఆడే గేన్ ప్లాన్ ఇదని, ఒక రకంగా ఇది జనాన్ని మోసం చేయటమేనని మండిపడ్డారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజలకు బాగా అందుతున్నాయని, అందుకే ప్రజలు కూడా మాపై పాజిటివ్‌గా ఉన్నారని అందుకే నేషనల్ మీడియా చేసిన సర్వేలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని సజ్జల పేర్కొన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు రాకూడదని టీడీపీ కోరుకుంటోందని, రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు పేదల పొట్ట కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
పేదలకు ఇళ్లు ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎవరిని అధ్యక్షుడిగా పెట్టుకుంటుందో అది వారి ఇష్టమని, వారితో తమాకే పని? అని మీడియా చేసే ప్రచారాలతో తమకు సంబంధం ఏం ఉంది? అని ప్రశ్నించారు.
