బి రామకృష్ణంరాజు,
వ్యవస్థాపకులు, మనొబంధు
విశాఖపట్నం బీచ్ లో ఒక మధ్యవయస్సు మహిళ నిరాదరణకులోనై తిరుగుతూ కనిపించింది. ఆమె ఆంగ్లంలో మాట్లాడుతూ ఉండడం, వివిధ కోర్ట్ కేసులలో న్యాయసంబంధ అంశాలను ప్రస్తావిస్తూ ఉండడంతో విషయం తెలిసి పట్టణ, గిరిజన అభివృద్ధి సంఘం (ఎయుటిడి) కార్యదర్శి ప్రగాఢ వాసు తమ షెల్టర్ హోమ్ కు తీసుకు వచ్చారు.
ఆమె సుప్రీం కోర్ట్ న్యాయవాది అని, మానిసిక అనారోగ్యంతో ఆ విధంగా తిరుగుతున్నదని గ్రహించి, ఆమెకు తగు వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఆ విధంగా వీధులలో నిరాదరణకు గురై తిరుగుతున్న మానసిక రోగులను దరిచేర్చి, వారికి వైద్యం, పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ “మనోబంధు” లో ఆయన గౌరవ సభ్యునిగా పనిచేస్తున్నారు.
మానసిక అనారోగ్యం, వైకల్యం మానవ జీవనంపై ఊహించలేని రుగ్మతలకు దారి తీస్తుంది. ఏ రకమైన మానసిక రుగ్మతకైనా జీవితకాల వ్యాప్తి రేట్లు గతంలో అనుకున్నదానికంటే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలి సమూహాలలో పెరుగుతున్నాయి. దాదాపు సగం జనాభాను ప్రభావితం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
మానసిక రుగ్మతల కోసం రోగనిర్ధారణ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారిలో సగం కంటే తక్కువ మందిని మాత్రమే వైద్యులు గుర్తింప గలుగుతున్నారని డబ్ల్యుహెచ్ఓ తెలుపుతున్నది. రోగులు కూడా వృత్తిపరమైన సహాయం తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. మానసిక స్థితి, ఆందోళన లేదా పదార్థ వినియోగ రుగ్మతను ఎదుర్కొంటున్న ప్రతి 5 మందిలో 2 మంది మాత్రమే రుగ్మత ప్రారంభమైన సంవత్సరంలో వైద్య సహాయం కోరుతున్నారు.
సాధారణ జనాభాతో పోలిస్తే మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను నేరస్థులుగా పరిగణిస్తూ వారిపై అభియోగాలు మోపుతూ, జైళ్లలో ఎక్కువకాలం ఉంచుతున్నారు. అయితే ఈ విషయమై జరిగిన అధ్యయనాలు అందుకు భిన్నమైన అభిప్రాయం కలిగిస్తున్నాయి. హింసాత్మక నేరాలకు పాల్పడేవారి కంటే మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు.
భారత ప్రభుత్వం జరిపిన 2015-16 సర్వే ప్రకారం, మన దేశంలో దాదాపు 15 శాతం మంది పెద్ద వయస్సులో ఉన్నవారు ఏదో ఒక రకమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. అంటే అటువంటి వారి సంఖ్య 18 కోట్లకన్నా ఎక్కువగా ఉంటుంది. అయితే వారిలో చాలా కొద్దిమందికి మాత్రమే అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మానసిక వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. భారతదేశంలోని 80 శాతంకు పైగా ప్రభుత్వ ఆసుపత్రులలో మానసిక వైద్యులు లేరు. చాలా మంది భారతీయ మనోరోగ వైద్యులు మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం కూడా అందుకు ఒక ప్రధాన కారణం.
పేద, మధ్య తరగతి కుటుంబాలలోనే కాకుండా సంపన్న కుటుంబాలలో కూడా అటువంటి వారిని కుటుంభం సభ్యులు పట్టించుకోవడం లేదు. దానితో వారు నిరాదరణకు లోనై వీధులలో తిరుగుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే అటువంటి వారు ఒక లక్ష మంది వీధులలో తిరుగుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కరోనా, లాక్డౌన్ మధ్య దేశవ్యాప్తంగా వీధుల్లో తిరుగుతున్న మానసిక రోగుల మానవ హక్కుల ఉల్లంఘనపై వచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవహక్కుల కమీషన్ గత ఏడాది ఏప్రిల్ లో ఒక ఫిర్యాదును స్వీకరించింది. వారి కోసం చేసిన ఏర్పాట్ల గురించి తెలపమని కేంద్ర హోంశాఖను కోరింది.
కరోనా మహమ్మారి వ్యాప్తిపై పోరాడటానికి, పౌరులకు ఆహారం, ఆరోగ్య సంరక్షణపై హక్కును నిర్ధారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా సమాజంలోని మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం అని కమీషన్ స్పష్టం చేసింది. సాధారణ పరిస్థితుల్లో కూడా, వారు ఇతరులపై ఆధారపడతారని, ఎల్లప్పుడూ వారికి మద్దతు అవసరం అని స్పష్టం చేసింది.
ఆదరించే వారు లేక, ఎటువంటి దిక్కు లభించక మానసిక అనారోగ్యాలకు గురయిన వారు నిరాశ్రయులై వీధులలో తిరుగుతూ ఉండడం మానవత్వానికే మచ్చ. అటువంటి వారిని సమీకరించి, వారికి తగు వైద్య, వసతి సదుపాయాలు ఏర్పర్చి, వారిని తమ కుటుంబాలతో తిరిగి కలసి విధంగా చేయడం కోసం “మనోబంధు” సంస్థ ద్వారా కృషి చేస్తున్నాము.
ఈ మధ్యనే విశాఖపట్నంలో పోలీసులు, ఎయుడిటి సంస్థ సమకారంతో 10 మంది మానసిక రోగులను చేరదీసి, ప్రభుత్వ మానసిక రోగుల వైద్యశాలలో చేర్పించాము. ఇప్పటి వరకు 150 మందిని ఆ విధంగా చేర్పించాము. గత అక్టోబర్ లో “మనోబంధు” ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కళ్ళం చేతుల మీదుగా ప్రారంభించాము.
దీనిని ఒక నిరంతర కార్యక్రమంగా రాష్ట్రం అంతటా వీధులలో తిరుగుతున్న వారిని ఆసుపత్రులలో చేర్పించేందుకు కృషి చేస్తున్నాము. జిల్లా, మండల స్థాయిలో రోడ్లపై తిరుగుతున్న మానసిక రోగులను గుర్తించి, వారిని ఆసుపత్రులలో చేర్పించేందుకు ప్రణాళికలను రుపొందిస్తున్నాము.
ఆసుపత్రులలో మానసికంగా కోలుకున్న వారి కోసం తిరుపతిలో ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని సంకల్పించాము. మన మన తోటివారు నిరాదరణకు గురై, మానసిక ఆరోగ్యంతో రోడ్డులపై దిక్కులేక తిరుగుతూ, మురికి కాలువలలో నీరు తాగుతూ గడుపుతూ ఉండడం మనందరికీ అవమానకరమే. ఈ మహా యజ్ఞంలో అందరు కలసి రావాలి.
ఈ సందర్భంగా సంబంధిత ప్రభుత్వ శాఖల సహకారం కూడా తీసుకొని, వారు కూడా ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా వ్యవహరించే విధంగా కృషి చేస్తున్నాము. మానసికంగా మెరుగైన వారు తిరిగి తమ కుటుంభ సభ్యులతో కలసి జీవించే విధంగా, కుటుంభ సభ్యులకు కూడా అవగాహన కార్యక్రమాలు నిరవహిస్తాము. ముందుగా అటువంటి విశాఖపట్నంపై దృష్టి సారించి, జనవరి నుండి రోడ్లపై, ముఖ్యంగా కూడళ్లలో ఉన్నవారిని గుర్తించి, ఆదరించేందుకు పెద్ద ఎత్తున కృషి చేయాలని అనుకొంటున్నాము.
ఈ యజ్ఞంలో మాతో కలసి వచ్చే స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సేవకులు మాతో (మొబైల్: 98866887299) సంప్రదించాలని కోరుతున్నాను. విశాఖపట్నంలో ఈ ఉద్యమంలో భాగస్వామి కాదలచినవారు 9704105886, 9948833010 నంబర్లతో సంప్రదించాలని కోరుతున్నాను.
మరోవంక తెలుగు రాష్ట్రాలలో మానసిక వైద్య సదుపాయాలను విస్తరింప చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. ప్రస్తుతం విశాఖపట్నం, హైదరాబాద్ లలో మాత్రమే మానసిక ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయి. దాదాపు అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో మానసిక వైద్య సదుపాయాలను విస్తరింప చేయవలసి ఉంది.