ఉజ్జయిని మహంకాళి వేడుకల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. బోనాల ఉత్సవాల్లో ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు. గతేడాది తనకు ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారన్నారు. కావాల్సిన బలాన్నిచ్చానని.., మీ వెంటా ఉంటానని చెప్పారు.ఈ ఏడాది ఆలస్యమైనా వర్షాలు తప్పకుండా వస్తాయని అభయమిచ్చారు.
”అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి..ప్రజలు భయపడ వద్దని అభయం ఇచ్చారు. నా వద్దకు వచ్చే ప్రజలను కాపాడే భారం నాదేనని చెప్పారు. ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే భాధ్యత నాదేనని, ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలన్నారు. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నానని స్వర్ణలత అన్నారు.
ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. భవిష్యవాణి వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
బోనాలు కార్యక్రమం బాగా జరిగిందని అమ్మవారు భవిష్యవాణిలో చెప్పటం సంతోషంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కాసేపట్లో పోతరాజులు ఊరేగింపు, ఘటోత్సవం జరుగుతుందని చెప్పారు. ఈసారి లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. రాత్రి వరకు దర్శనాలు కొనసాగుతాయని వెల్లడించారు. సాయంత్రం 7 గంటలకు ఫలహారం బండ్ల ఊరేగింపు ఉంటుందని మంత్రి తెలిపారు.
