సుస్థిరాభివృద్ధికి పర్యావరణ పరిరక్షణే మార్గమని భారత పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ప్రకృతిని కాపాడుకుంటూ నిర్దేశించుకున్న సమయానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుందామంటూ ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్ డబ్ల్యుటిఒ) వేదిక పై నుంచి పిలుపునిచ్చారు.
పర్యాటక రంగంలో ఆర్థిక ప్రగతి, సామాజిక, పర్యావరణ సుస్థిరత అంశంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో హైలెవల్ పొలిటికల్ ఫోరం వేదికగా జరిగిన సదస్సులో కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా పర్యావరణ సుస్థిరత కోసం మోదీ సర్కారు చేస్తున్న కృషి కారణంగా.. నేడు టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఎజెండా నిర్దేశించడంతోపాటు ముందుండి విజయవంతంగా నడిపామని తెలిపారు.
జీ-20 ప్రెసిడెన్సీ ద్వారా పర్యాటక వర్కింగ్ గ్రూపు సమావేశాల నిర్వహణతోపాటు గోవాలో గత నెలలో జరిగిన జీ20 సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల పర్యాటక మంత్రుల సమావేశంలో ఏకగ్రీవంగా ‘గోవా రోడ్ మ్యాప్’కు ఆమోదం తెలిపిన విషయాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు.
ఈ గోవా రోడ్ మ్యాప్‌లో.. గ్రీన్ టూరిజం (సుస్థిర, బాధ్యతాయుతమైన, హరిత పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా సరైన ఫలితాలను సాధించడం), డిజిటలైజేషన్ (పర్యాటక రంగంలో సుస్థిరత, సమగ్రతను సాధించేందుకు డిజిటలైజేషన్ ద్వారా ఓ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకోవడం), స్కిల్స్ (యువత నైపుణ్యాలకు పదునుపెడుతూ పర్యాటక రంగంలో ఉపాధి, వ్యాపారసామర్థ్యాన్ని పెంచేలా చర్యలు), టూరిజం ఎంఎస్ఎంఈలు (పర్యాటక రంగంలోని ఎంఎస్ఎంఈలకు, స్టార్టప్‌లకు, ప్రైవేటు రంగానికి సరైన ప్రోత్సాహాన్ని అందిస్తూ.. సృజనాత్మకతకు పెద్దపీట వేయడం), డెస్టినేషన్ మేనేజ్మెంట్ (గమ్యస్థానాల్లో అవసరమైన నిర్వహణ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంపై పునరాలోచన తద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సమగ్రమైన విధానంతో ముందుకెళ్లడం) అనే ఐదు కీలకమైన అంశాలపై ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తుచేశారు.
పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు.. వివిధ దేశాలతో కలిపి థీమ్ ఆధారిత.. బుద్దిస్ట్ సర్క్యూట్, రామాయణ సర్క్యూట్, హిమాలయన్ సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్ మొదలైన వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ పర్యాటక విధానం ముసాయిదాలో ఇలాంటి వాటికి సరైన ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్‌తోపాటు ప్రపంచ పర్యాటకానికి కూడా ఎంతో సానుకూల ఫలితాలను అందిస్తుందని వివరించారు.