నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఒక్క రోజే ఆరుగురు రోగులు మృతి చెందడం కలకలం రేపింది. మృతుల్లో సాంబయ్య (60), ఎస్.లీలావతి (62), పి.రమేష్ (42), ఎన్.చలపతి (52), వై.సుందరం (70), చెంచమ్మ (70) ఉన్నారు. ఆక్సిజన్ అందకే వారు మరణించారని మీడియాలో శనివారం రావడంతో దీనిపై విచారణ జరపాలని డిఎం అండ్ హెచ్ఒను జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు.
దీంతో, జిజిహెచ్‌కు వచ్చి డిఎం అరడ్ హెచ్ఒ పెంచలయ్య విచారణ చేపట్టారు. ఆస్పత్రికి రోగులు ఎప్పుడు వచ్చారు? ఏ కండిషన్లో వచ్చారు. వారికి వైద్యులు ఎలాంటి వైద్యం అందించారు? వారు ఏ కారణంతో చనిపోయారు? అనే విషయాలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ కూడా జిజిహెచ్‌కు వచ్చి వివరాలు సేకరించారు.
మీడియాతో డిఎం ఆరడ్ హెచ్ఒ పెంచలయ్య, జిజిహెచ్ సూపరింటెండెంట్ నాయక్ మాట్లాడుతూ ఆక్సిజన్ అందక చనిపోయారనేది దుష్ప్రచారమని తెలిపారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదని, ఆస్పత్రికి చెన్నరు నుంచి లిక్విడ్ ఆక్సిజన్ వస్తుంటుందని, ఆస్పత్రిలో మూడు ట్యాంకర్ల లిక్విడ్ ఆక్సిజన్ నిల్వ ఉందని చెప్పారు.
వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది చివరి దశలో ఇంటికి తీసుకెళ్లమన్న రోగులను జిజిహెచ్‌కు తీసుకొస్తుంటారని, ఇటువంటి వారి పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంటుందని చెప్పారు. ఈ పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చిన రోగులను బతికించడం కష్టమని పేర్కొన్నారు. ఎంఐసియు యూనిట్లో చికిత్స పొందుతున్న ఆరుగురూ ఉదయం 9.33 నుంచి సాయంత్రం 6.28 గంటల మధ్యలో మృతి చెందారని తెలిపారు.
చికిత్స అందించినా ఫలితం లేకపోయిందని, అనారోగ్య కారణాల వల్ల పరిస్థితి విషమించి వారు మరణించారని చెప్పారు. గత వారం రోజుల్లో మృతి చెందిన వారి వివరాలను మీడియాకు అధికారులు తెలియజేశారు. 17న ఒకరు, 18న నలుగురు, 19న ఇద్దరు, 20న ముగ్గురు, 21న ఆరుగురు, 22న నలుగురు మృతి చెందారని చెప్పారు. కలెక్టర్ కూడా శనివారం సాయంత్రం ఆసుపత్రి సందర్శించి అక్కడ వైద్యంలో ఎటువంటి లోపం జరగలేదని స్పష్టం చేశారు.
