తెలంగాణలోని నలుగురు ప్రముఖ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. పీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో చేరారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్సులు తరుణ్ చుగ్, బండి సంజయ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు – బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు డా. కే. లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి – తెలంగాణ ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవడేకర్, రాష్త్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డిల సమక్షంలో ఈ నలుగురు పార్టీలో చేరారు.
వారికి తరుణ్ చుగ్ కండువగా కప్పి స్వాగతించగా, కిషన్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించారు. పార్టీలో చేరిన నలుగురు నేతలకు కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. తర్వాత నేతలు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిశారు.
విద్యార్థి దశలోనే కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నుంచి రాజకీయాల్లో ఉన్న రంగారెడ్డి ఆ పార్టీకి దశాబ్దాలుగా విశేష సేవలు అందించారని కిషన్ రెడ్డి చెప్పారు. ఇంతటి సుదీర్ఘ రాజకీయానుభవాన్ని ఇకపై బీజేపీ ఉపయోగించుకుంటుందని తెలిపారు. మరోవైపు అజాత శత్రువుగా ఉన్న ఆకుల రాజేందర్ కి మంచి పేరుందని, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో విశేష సేవలు అందించిన బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి కూడా చేరారని, ఈ కుటుంబానికి మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో ఎంతో సాన్నిహిత్యం ఉందని గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో పేరున్న కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి కూడా బీజేపీలో చేరారని చెప్పారు.
తెలంగాణ గ్రామీణ యువతలో బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని, కేసిఆర్ అహంకార, కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయని ధ్వజమెత్తుతూ కాంగ్రెస్లో గెలిచిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని గుర్తుచేశారు.
మోదీ సర్కారు మీద ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ఈ మూడు పార్టీలు సంతకాలు చేశాయని, ఇదే ఆ పార్టీల మధ్య బంధానికి ఉదాహరణ అని ఆరోపించారు. ఎన్నికలకు ముందు, లేదంటే ఎన్నికల తర్వాత కలిసి పనిచేస్తాయని, కలిసే ప్రయాణం చేస్తాయని ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీల మధ్య ముక్కోణపు ప్రేమ కథ ఈ నడుస్తోందని విమర్శించారు.
బీఆర్ఎస్తో బీజేపీ ఏనాడూ కలిసి పనిచేయలేదని, ఆ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ సమాజంలోని సామాన్యులతో పాటు కవులు, కళాకారులు, రచయితలు, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు బీజేపీకి మద్దతిస్తున్నాయని భరోసా వ్యక్తం చేశారు.