భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపుకు పాల్పడ్డారనే అభియోగాలపై అనంతపురం జిల్లా జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. నిబంధనలు పాటించకుండా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారంటూ గత కొంత కాలంగా టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది.
ఈ క్రమంలో ఈసీకి చెందిన అధికారులు అనంతపురం జిల్లా ఉరవకొండలో నేరుగా క్షేత్ర స్థాయి పర్యటన సైతం నిర్వహించారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన విధి విధానాలు పాటించకుండా ఏకపక్షంగా ఓట్లు తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓట్ల తొలగింపుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో పంచాయితీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2020, 2021వ సంవత్సరాల్లో ఉరవకొండలో 1,116 ఓట్ల తొలగించడానికి కారకులైన నాటి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, అనంతపురం జిల్లా జడ్పీ సీఈవో కె.భాస్కర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, అధికారుల అనుమతి లేకుండా జిల్లా కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. ఉరవకొండ నియోజకవర్గంలో 2020, 2021వ సంవత్సరాల్లో తెదేపా సానుభూతి పరులైన సుమారు 6వేల ఓట్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అధికారులు తొలగించారు.
ఓట్ల తొలగింపుకు నిర్దేశించిన ఫారం-7కు సంబంధించి అనుసరించాల్సిన నిబంధనలకు విరుద్దంగా ఒకే దరఖాస్తుపై పెద్ద మొత్తంలో ఓట్లను జాబితాల నుంచి తీసేశారు. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ 2022 అక్టోబరు 27న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు అంశంపై వచ్చిన ఫిర్యాదుపై విచారించి వారంలో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని 2022 నవంబరు 3న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసీ లేఖకు స్పందన లేకపోవడతో నవంబరు 11న మరోసారి గుర్తు చేసింది. ఈ క్రమంలోనే నవంబరు 14వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు.
దీంతో అనంపురం జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జడ్పీ సీఈఓ, ఉరవకొండ ఈఆర్ఓ జాబితాలు పరిశీలించి నివేదిక ఇచ్చారు. ఈఆర్ఓ ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో తప్పులను గుర్తించిన ఎమ్మెల్యే కేశవ్ సాక్ష్యాధారాలతో 2022 డిసెంబరు 7న మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
దీంతో గుంతకల్లు ఆర్డీవోను విచారణ అధికారిగా నియమించారు. ఆయన విచారణ జరిపి డిసెంబరు 29న మరో నివేదిక ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఈ ఏడాది జనవరి 3న ఇద్దరు బీఎల్ఓలను సస్పెండ్ చేసి సరిపెట్టారు. కేశవ్ ఫిర్యాదు నేపథ్యంలో జనవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అనంతపురం జిల్లాకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారించాలని ఈ ఏడాది జూన్ 6న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌కు లేఖ పంపారు. దీనికి అనుగుణంగా కలెక్టర్ జూన్ 10న ప్రత్యేక బృందాన్ని నియమించారు.