మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న అలియాస్ సంగ్రామ్ మరణించారని ఈ నెల 18న వచ్చిన వార్తలను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. మల్లా రాజిరెడ్డితో పాటు కట్టా రామచంద్రా రెడ్డి చనిపోలేదని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, కట్ట రామచంద్రారెడ్డి చనిపోయినట్టు వైరల్ అయిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంటూ మవోయిస్ట్పార్టీ ఉత్తర సబ్ జోనల్ దండకారణ్య అధికార ప్రతినిధి మంగ్లీ పేరిట పత్రికా ప్రకటన విడుదలైంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే తమ నేతల ఆచూకీని కనిపెట్టేందుకే పోలీసులు ఆడిన కుట్రలో భాగమేనని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. అయితే, పోలీసులు చేసిన ప్రయత్నం విఫలమైందన, ఇద్దరు నేతలు క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న అనారోగ్యంతో చనిపోయినట్టుగా ఆగస్టు 18న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. చత్తీస్గఢ్ పోలీసులు కూడా ధ్రువీకరించారు. అయితే అదంతా తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు పన్నిన కుట్రగా మావోయిస్టు పార్టీ అభివర్ణించింది. మల్లా రాజిరెడ్డి స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి.
తొలితరం మావోయిస్టు అయిన రాజిరెడ్ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నట్టు సమాచారం. ఆయన వయసు ప్రస్తుతం 70 ఏళ్లు. మావోయిస్టు అగ్రనేతగా ఉన్న రాజిరెడ్డిపై దేశంలోని చాలా ప్రాంతాల్లో కేసులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉందంటే అర్థం చేసుకోవచ్చు.
ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసులో రాజిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్న సత్తన్న గతంలో సుమారు రెండున్నరేళ్లు కరీంనగర్ జైలులో ఖైదీగా ఉన్నారు.