ఐదు దేశాల కూటమి అయిన ‘బ్రిక్స్’ మరింతగా విస్తరించనున్నది. ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘బ్రిక్స్’లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. అయితే సభ్య దేశాల సంఖ్యను పెంచాలని ఈ గ్రూప్ నిర్ణయించింది. దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో రెండు రోజులపాటు జరిగిన ‘బ్రిక్స్’ సమ్మిట్‌లో దీని గురించి ప్రధానంగా చర్చించారు.
ఈ నేపథ్యంలో బ్రిక్స్ గ్రూప్‌లోకి ఆరు దేశాలను శాశ్వత సభ్యులుగా ఆహ్వానిస్తున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా తెలిపారు. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాలు ‘బ్రిక్స్’ గ్రూప్‌లో చేరుతాయని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ఆరు దేశాల సభ్యత్వం అమలులోకి వస్తుందని అన్నారు.
కాగా, ‘బ్రిక్స్’ సమ్మిట్‌లో పాల్గొన్న భారత ప్రధాని మోదీ దీనిపై హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా ఆరు దేశాలను ఈ గ్రూప్‌లోకి ఆహ్వానించడాన్ని స్వాగతించారు. ఈ ఆరు దేశాలతో భారత్‌కు చాలా సన్నిహిత, చారిత్రక సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
కొత్త శకం, సహకారం, శ్రేయస్సు కోసం తామంతా కలిసి పని చేస్తామని అన్నారు. ‘బ్రిక్స్’ సమ్మిట్‌లో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా గ్రూప్ విస్తరణకు మద్దతిచ్చారు. మరోవైపు ‘బ్రిక్స్’ సభ్యులుగా చేరేందుకు 20కుపైగా దేశాలు ఆసక్తి చూపాయి.
శాశ్వత సభ్యత్వం కోసం దరఖాస్తు కూడా చేశాయి. అయితే వీటిలో ఆరు దేశాలను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో 2024 జనవరి 1 నుంచి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాలు ‘బ్రిక్స్’ సభ్యత్వం పొంది ఈ కూటమిలో చేరనున్నాయి.